తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్ : తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. చివరకు కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల రక్తపు కూడును కూడా తింటుందని జూపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

తెలంగాణలో ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వనున్నట్లు కేసీఆర్ కు అర్థమయ్యింది... అందువల్లే రెండు చోట్ల పోటీకి సిద్దమయ్యారని జూపల్లి అన్నారు. ఇలా కేసీఆర్ ఓటమిని ముందే అంగీకరించారని అన్నారు. గజ్వెల్ ప్రజలు కేసీఆర్ ను ఓడించడానికి సిద్దంగా వున్నారు... అందువల్లే కామారెడ్డిలో పోటీకి సిద్దమయ్యారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అక్రమంగా సంపాదించిన వందల కోట్లు ఖర్చుచేసినా బిఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదని... కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టనున్నారని జూపల్లి ధీమా వ్యక్తం చేసారు. 

ఇప్పటికైనా కేసీఆర్ గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే ప్రజలే బిఆర్ఎస్ కు తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఇప్పుడు హామీలిస్తున్న కేసీఆర్ గెలవగానే వాటిని మరిచిపోయే రకమని అన్నారు. ఒకవేళ కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేయడం ఖాయమని జూపల్లి అన్నారు.

Read More చిలక పలుకుల కవితమ్మ... శ్రీరంగనీతులు చెప్పిన మీకే చిత్తశుద్ది లేదు : షర్మిల సెటైర్లు

మంత్రి హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ తిరుమల సాక్షిగా బిఆర్ఎస్ అదిష్టానంపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తిరుగుబాటు చేసారని జూపల్లి అన్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా తాండూరు టికెట్ దక్కకపోవడంపై అసంతృప్తితో వున్నారన్నారు. వీరిద్దరూ కేసీఆర్ కు దిమ్మతిరిగేలా దెబ్బకొట్టాలని... తద్వారా తమ బలాన్ని ప్రదర్శించుకోవాలని జూపల్లి సూచించారు. 

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలంటూ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు... కానీ ఇది పార్టీలో ప్రజాస్వామ్యానికి నిదర్శనమని జూపల్లి అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్ ను ఓడించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతి, అక్రమాలన్నీ బయటపడతాయని జూపల్లి కృష్ణారావు అన్నారు.