బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడం సంతోషమేనని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అయితే తనను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలని కోరారు.
బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడం సంతోషమేనని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అయితే తనను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలని కోరారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండేదన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తనను సస్పెండ్ చేయడంపై మాట్లాడేందుకు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అయితే జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశాన్ని అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. స్పీకర్ ఆదేశాలు లేకుండా ఎలాంటి సమావేశాలు జరపాదని అన్నారు. అయితే వారి తీరుపై జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మరోచోట మీడియాతో మాట్లాడుతూ.. మూడేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వలేదని.. తాను సభ్యుడిగా ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. ఈరోజు సస్పెండ్ చేస్తున్నారంటే.. తాను పార్టీ సభ్యుడనని వాళ్లే అంటున్నట్టు కదా? అని ప్రశ్నించారు.
పంజరం నుంచి పక్షులు బయటకు వచ్చినట్టుగా ఉందని అన్నారు. దొరలగడీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అయితే తనను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేయాలన్నారు. ప్రభుత్వ బండారం బయటపడుతుందనే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. తెలంగాణ కోసం తాను పదవులు త్యాగం చేశానని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వారిలో తాను ఒకరినని తెలిపారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కారణం ప్రభుత్వ పెద్దలేనని ఆరోపించారు. సీనియర్లు ఉండవద్దనే కారణంతోనే తన ఓటమికి యత్నించారని విమర్శించారు.
