ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. జూడాలతో ఆసుపత్రి సూపరింటెండెంట్ చర్చలు సఫలం కావడంతో సమ్మె ముగిసింది. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ సమస్య పరిష్కారానికి సూపరింటెండెంట్ అంగీకరించారు.

దీంతో గత నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెను జూడాలు విరమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, రోగి ఆస్పత్రికి వస్తే తీసుకెళ్లడానికి స్ట్రెచర్ లేకుండా ఉందని, కనీసం ఆక్సిజన్ కూడా ఇవ్వలేని పరిస్థితులు దాపురించాయని ఆరోపిస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు.

రోగులకు ఇక్కడ ఎలాంటి చికిత్స అందిస్తున్నారో, అతనికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఇందుకు ఓ మనిషి బొమ్మను తయారు చేసి దానికి బట్టలు తొడిగి శస్త్ర చికిత్స చేసినట్లు నటించారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఎదుటే టేబుల్‌పై మనిషి బొమ్మను పడుకోబెట్టి జూనియర్ డాక్టర్లు ఈ నిరసన చేపట్టారు.