జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసు: కారులో ఎమ్మెల్యే షకీల్ కుమారుడు, కన్ఫర్మ్ చేసిన పోలీసులు.. గాలింపు
అనుమానాలే నిజమయ్యాయి.. జూబ్లీహిల్స్ లో రెండేళ్ల చిన్నారి మరణానికి కారణమైన కారు ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. ప్రమాదానికి కారణమైన కారులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ వున్నట్లుగా పోలీసులు ధ్రువీకరించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు (jubilee hills car crash) అనూహ్య మలుపు తిరిగింది. బాలుడి మృతికి కారణమైన కారులో ఎమ్మెల్యే షకీల్ (bodhan mla shakeel) కుమారుడు రాహిల్ (raheel) వున్నట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
గురువారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ను దాటి వేగంగా వస్తున్న కారు.. కాజల్ చౌహాన్, సారిక చౌహాన్, సుష్మ బోంస్లేను ఢీకొట్టింది. ఈ ఘటనలో కాజల్ చౌహాన్ చేతిలో ఉన్న రెండున్నర నెలల బాబు Ranveer Chouhan కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఈ కారు టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ తో తిరుగుతుంది. కారుపై బోధన్ ఎమ్మెల్యే Shakeel స్టిక్కర్ కూడా ఉంది. కారు మొత్తానికి బ్లాక్ గ్లాస్ ఉంది. దీంతో ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరున్నారనే విషయం గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు ప్రమాదం జరిగిన చోట CCTV కెమెరాలు లేవని కూడా పోలీసులు చెబుతున్నారు.
మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో ఈ కారును కొనుగోలు చేసినట్టుగా రవాణా శాఖ అధికారుల వద్ద సమాచారాన్ని బట్టి పోలీసులు గుర్తించారు. మూడు మాసాల క్రితం ఈ కారును కొనుగోలు చేశారు. అయితే 15 రోజుల క్రితమే ఈ కారుకు Bodhan ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ అంటించి ఉంది. ఇక, కారు ప్రమాదంలో గాయపడిన మహారాష్ట్ర వాసి కాజల్ చౌహాన్‌ను పోలీసులు నిమ్స్‌లో చేర్పించగా.. ఆమె శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యింది. అయితే ఈ ప్రమాదంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ఈ ప్రమాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. తాను ప్రస్తుతం Dubai లో ఉన్నానని షకీల్ చెప్పారు. కారు ప్రమాదం తన బంధువు కుమారుడు చేశాడని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని అన్నారు.
ఇక, ప్రమాదానికి ముందు గచ్చిబౌలిలోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ వద్ద కారు ఆగినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ రెస్టారెంట్ వద్ద సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాద సమయంలో కారు డ్రైవింగ్ సీటులో ఎవరున్నారనే దానిపై మాత్రం స్పష్టత రాన్నట్టుగా తెలుస్తోంది. స్థానికులు వారిపై దాడి చేసే ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి కిందకు దిగి పారిపోయాడు. పక్కనే కూర్చున్న వ్యక్తి కూడా బయటకు వచ్చి వేరే దారిలో పారిపోయాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ వున్నట్లుగా పోలీసులు గుర్తించడంతో కేసు అనూహ్య మలుపు తిరిగింది.