Jubilee Hills Bypoll Results 2025 : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది.
Jubilee Hills By Election 2025 : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు అతడికి 6 వేలకు పైగా మెజారిటీ లభించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి అతడి గెలుపు ఖాయమైనట్లే… మిగతా రౌండ్లలో ఆధిక్యం మరింత పెరుగుతుందని కాంగ్రెస్ ధీమాతో ఉంది. 10 నుండి 15 వేల మెజారిటీతో గెలుస్తామని అభ్యర్థి నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా సమాచారం మేరకు ఇప్పటివరకు జూబ్లీహిల్స్ లో మొదటి రౌండ్ పూర్తయినట్లు ఉంది. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 8911 ఓట్లు, మాగంటి సునీతకు 8864 ఓట్లు వచ్చాయి. ఇలా 47 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. మొదటి రెండు రౌండ్స్ లో కాంగ్రెస్ ఆధిక్యం సాగించింది. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ కు 8,926 ఓట్లు రాగా బిఆర్ఎస్ కు 8,864 ఓట్లు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. రెండో రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యాన్ని సాధించింది... నవీన్ యాదవ్ కు 9691 ఓట్లు, మాగంటి సునీతకు 8609 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం వెయ్యి ఓట్లకు పైగా ఆధిక్యంలో నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు.
రాజధాని హైదరాబాద్ లోనే కాదు యావత్ తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పోలింగ్ ముగియగా ఇవాళ (నవంబర్ 14, శుక్రవారం) ఫలితాలు వెలువడనున్నాయి. కొద్దిసేపటిక్రితమే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించారు... తర్వాత 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నంలోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడుతుంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం :
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇక బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా మాదాపూర్ సుబ్రహ్మణ్య ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇలా అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులంతా ఓట్ల లెక్కింపు జరిగే కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియంకు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు సాగనుందిలా :
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం 42 టేబుల్స్ ఏర్పాటుచేశారు. మొత్తం 186 మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపు కోసం ఉపయోగిస్తున్నారు. ఒక్కో రౌండ్ లెక్కింపుకు 40 నిమిషాల సమయం పడుతుంది. పలితం వెలువడినతర్వాత రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ అభ్యర్థి మృతి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పలితాలు వెలువడేరోజే విషాదం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) గుండెపోటుతో మృతిచెందారు. ఎర్రగడ్డలోని ఆయన నివాసంలోనే ఆయన గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలారు.
