- Home
- Telangana
- Jubilee Hills Bypoll 2025 : ఓ భార్య.. ఓ తల్లి.. ఓ కొడుకు.. మాగంటి కుటుంబంలో సినిమా ట్విస్టులు
Jubilee Hills Bypoll 2025 : ఓ భార్య.. ఓ తల్లి.. ఓ కొడుకు.. మాగంటి కుటుంబంలో సినిమా ట్విస్టులు
జూబ్లిహిల్స్ ఉఎన్నికల వేళ మాగంటి కుటుంబంలో గొడవలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ గొడవలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మాగంటి కుటుంబ వివాదాలు...
Maganti Family : జూబ్లిహిల్స్ ఉపఎన్నిక సంగతేంటోగానీ మాగంటి కుటుంబ వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది... సినిమా ట్విస్టులను తలపిస్తోంది. దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుటుంబ గొడవలు రోడ్డుపైకి వచ్చాయి.. ఆయన వారసులం మేమంటే మేమంటున్నారు. మాగంటి కుటుంబసభ్యుల గొడవ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఫలితాల తర్వాతే తేలనుంది... కానీ ప్రస్తుతానికి ఈ కుటుంబకథా చిత్రమ్ పొలిటికల్ స్క్రీన్ పై సందడి చేస్తోంది.
ఓ భార్య కథ...
జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ సీటు ఖాళీఅయ్యింది... దీంతో బిహార్ ఎన్నికలతో పాటే ఈ అసెంబ్లీకి కూడా ఉపఎన్నిక నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఆయన భార్య మాగంటి సునీతకు టికెట్ కేటాయించి బరిలోకి దింపింది... ఆమెతో పాటు కొడుకు, కూతుళ్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు... బిఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ ను ఇక్కడే మోహరించారు.
అయితే సరిగ్గా నామినేషన్ల పర్వం ముగిశాక అసలు సునీత మాగంటి భార్యే కాదని ఓ యువకుడు ఈసికి ఫిర్యాదు చేశాడు. తానే మాగంటి అసలు వారసుడినంటూ తారక్ ప్రద్యుమ్న కొసరాజు ముందుకువచ్చాడు... దీంతో మాగంటి కుటుంబకథా చిత్రం షురూ అయ్యింది.
ఓ కొడుక కథ...
తానే మాగంటి కుమారుడినని... హిందూ వివాహ చట్టం ప్రకారం తన తల్లి మాలిని దేవిని గోపినాథ్ పెళ్లాడాడంటూ తారక్ ప్రద్యుమ్న కొసరాజు అంటున్నాడు. తన తండ్రితో సునీత కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో మాత్రమే ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాదు ఆమె ఎన్నికల అపిడవిట్ లో మాగంటి గోపినాథ్ భార్యనని పేర్కొనడాన్ని తప్పుబడుతూ ఎన్నికల కమిషన్ కు లేఖరాయడం కొసమెరుపు. తాను అమెరికాలో ఉంటానని... తండ్రి అంత్యక్రియలకు రాకుండా కొందరు నాయకులు బెదిరించారని ప్రద్యుమ్న అంటున్నారు.
ఓ తల్లి కథ...
ఓవైపు మాగంటి గోపినాథ్ అసలు వారసులం మేమంటే మేము అంటూ వివాదం సాగుతున్న వేళ ఇప్పుడు మాగంటి తల్లి సీన్ లోకి ఎంటరయ్యారు. ఆమె వాదన మరోలా ఉంది.. తన కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ పేరును వివాదంలోకి లాగుతున్నారు. హాస్పిటల్లో ఉండగా కన్నకొడుకు గోపినాథ్ ను చూడనివ్వలేదని... హాస్పిటల్ వచ్చిన సమయంలో కేటీఆర్ ను వేడుకున్నా కనికరించలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేటీఆర్, మాగంటి సునీత ఇద్దరూ కలిసి తన కొడుకు మాగంటి గోపీనాథ్ చివరి చూపుకు నోచుకోకుండా చేశారంటున్నారు ఆ తల్లి. మొదట అతడు చనిపోయాడన్నారు... ఆ తర్వాత చావలేదన్నారు... చివరకు కేటీఆర్ వచ్చాక చనిపోయాడని ప్రకటించారంటున్నారు. తన కొడుకు చావుపై అనుమానాలున్నాయి... ఇందులో కేటీఆర్ ప్రమేయం ఉందనేలా గోపినాథ్ తల్లి ఆరోపణలు చేస్తున్నారు. చనిపోయాక కూడా బాడీని హాస్పిటల్లోనే ఎందుకు పెట్టారు? ఆయన వచ్చాక ఎందుకు డిక్లేర్ చేశారు? దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలంటున్నారు గోపినాథ్ తల్లి.
తాజాగా బండి సంజయ్ కొత్తవాదన..
మాగంటి గోపినాథ్ మరణంపై ఇప్పటికే వివాదాలు సాగుతుంటే తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కన్నేశారని... ఇప్పుడు ఈ ఇద్దరు ఓ ఒప్పందానికి వచ్చి ఆ ఆస్తులను పంచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. గోపీనాథ్ మరణం వెనుక మిస్టరీ ఉందని స్వయంగా ఆయన తల్లే చెబుతోంది... అయినా విచారణ జరపకపోవడానికి కారణం ఇదేనని అంటున్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోపినాథ్ మరణంపై సమగ్ర విచారణ జరపాల్సిందేనని మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.