Jubilee Hills Bypoll : జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు.. కానీ అప్పుడేే ప్రతిపక్ష బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. ఎవరికి అవకాశం ఇచ్చారో తెలుసా?
Jubilee Hills Bypoll : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఎన్నికల హడావిడి మొదలయ్యింది. నగర నడిబొడ్డున ప్రముఖులు ఎక్కువగా నివాసముండే జూబ్లిహిల్స్ అసెంబ్లీకి ఉపఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు... అయితే ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్సపొందుతూ మరణించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి.
ఈ ఉపఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అద్భుత విజయం సాధించినా జిహెచ్ఎంసి పరిధిలో కనీసం ఒక్కసీటును కూడా సాధించలేకపోయింది కాంగ్రెస్. అయితే అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల్లో విజయం ద్వారా హైదరాబాద్ లో ఖాతా తెరిచింది. ఇప్పుడు జూబ్లిహిల్స్ లో విజయం సాధించిన రెండో సీటు సాధించాలని చూస్తోంది.
జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు బిఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా జూబ్లిహిల్స్ ఉపఎన్నికలను సీరియస్ గా తీసుకుంది... ఎట్టి పరిస్థితుల్లో తమ సిట్టింగ్ సీటను వదులుకోకూడదని భావిస్తోంది. అందుకోసమే తీవ్ర పోటీ ఉన్నప్పటికీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దింపుతోంది. ఈమేరకు బిఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాగంటి సునీతను జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ అధికారిక ఎక్స్ లో ప్రకటించారు.
మాగంటి సునీతకే ఎందుకు అవకాశం?
చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేత, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకుడు మాగంటి గోపీనాథ్... ఆయన పార్టీకి, ప్రజలకు అందించిన సేవలను గుర్తించినట్లు తెలిపారు. అందుకే ఆయనను సాదరంగా గౌరవించుకుంటూ మాగంటి కుటుంబసభ్యులకే మరోసారి జూబ్లిహిల్స్ పోటీచేసే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా గుర్తింపుపొందిన మాగంటి గోపినాథ్ స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీతకు అవకాశం కల్పిస్తున్నాం... కాబట్టి ఈ కుటుంబానికి అండగా నిలవాలని బిఆర్ఎస్ కోరుతోంది. ప్రజల నుండి కూడా ఆమెకే అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ అధినాయకత్వానికి వినతులు అందాయని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
