మనస్థాపంతో జేపీఎస్ బైరి సోని ఆత్మహత్య.. న్యాయం చేయాలని ఉద్యోగుల ఆందోళన, క్యాండిల్ ర్యాలీ..
ఉద్యోగం పోతుందనే భయం, కుటుంబంలో నెలకొన్న ఇబ్బందులతో మనస్థాపం చెందిన ఓ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్యకు ఒడిగట్టారు. దీంతో జేపీఎస్ లు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కొంత కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు (జేపీఎస్ లు) ఆందోళన చేస్తున్నారు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో మనస్థాపం చెందిన ఓ జేపీఎస్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలంలో శుక్రవారం జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట మండలానికి చెందిన 29 ఏళ్ల బైరి సోనికి రంగసాయిపేటకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి తొమ్మిది సంవత్సరాల కిందట వివాహం జరిగింది. అయితే ఆమె ఖానాపురం మండల పరిధిలో ఉన్న రంగాపూరం అనే గ్రామంలో నాలుగు సంవత్సరాల నుంచి జూనియర్ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో జేపీఎస్ లు నిర్వర్తిస్తున్న నిరసన కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటున్నారు. అయితే జేపీఎస్ లు వెంటనే విధుల్లో చేరాలని హెచ్చరికలు జారీ చేయడంతో ఆమె ఈ నెల 6వ తేదీన వెళ్లి జాయిన్ అయ్యారు. అయితే కొంత కాలం నుంచి సోనికి, ఆమె భర్యకు మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
అయితే ఇటు ఉద్యోగం అభద్రతా భావం, అటు భర్తతో ఇబ్బందులు ఉండటంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో సోని శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు బయలుదేరారు. మార్గమధ్యలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. తరువాత తోటి జేపీఎస్ లకు కాల్ చేసి ఈ విషయాన్ని తెలిజేశారు. అయితే స్థానికులు ఆమెను నర్సంపేటలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ ట్రీట్ మెంట్ పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి మరణించారు.
వాట్సాప్ లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే.. బ్యాంకు ఖాతాలో రూ.6.16 లక్షలు ఖాళీ!
అయితే ఉద్యోగం పోతుందనే భయం, ఫ్యామిలీలో నెలకొన్న ఇబ్బందుల వల్లనే బైరి సోని ఆత్మహత్య చేసుకున్నారని జూనియర్ పంచాయతీ సెక్రటరీలు హాస్పిటల్ మార్చురీ ఎదుట నిరసన చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అంబులెన్స్ కు అడ్డంగా పడుకున్నారు. దీంతో పోలీసులు వారిని తొలగించారు. రాత్రి సమయంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని నినదించారు. దీంత స్థానిక ఆర్డీవో, డీసీపీ, డీపీవో రాత్రి సమయంలో నిరసనకారులతో చర్చలు జరిపినా.. అవి ఫెయిల్ అయ్యాయి. దీంతో పోలీసులు నిరసనకారులను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. కాగా.. తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. జేపీఎస్ బైరి సోని ఆత్మహత్యకు తెలంగాణ ప్రభుత్వమే కారణం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జేపీఎస్ పై ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును ఆయన విమర్శించారు. శనివారం తెలంగాణ వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీని నిర్వహించాలని బీజేపీ నాయకులను కోరారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.