తెలంగాణ సర్కారుపై జర్నలిస్టులు కన్నెర్రజేశారు. నాలుగేళ్లపాటు ఎదురుచూసిన జర్నలిస్టులు ఇక తాడో పేడో తేల్చుకోక తప్పదన్న హెచ్చరికలు పంపుతున్నారు.

టీయూడబ్ల్యూజే-ఐజేయూ ప్రెస్ మీట్ రెండురోజుల క్రితం జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మే 28వ తేదీన హైదరాబాద్ లో జర్నలిస్టుల ఘర్జన సభ జరపనున్నట్లు జర్నలిస్టు నేతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోను విస్మరిస్తూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. సర్కారు వైఖరికి వ్యతిరేకంగా జాప్యాన్ని నిరసిస్తూ  మే28న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు, హెల్త్ కార్డు అందించాలని, జెహెచ్ఎస్ పథకాన్ని ఆరోగ్యశ్రీలో విలీనం చేయకుండా, ఆ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో ఐజెయు మాజీ సెకట్రరీ జనరల్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పత్రిక వ్యవస్థ ప్రాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చంపేస్తుందని ఆరోపించారు. చిన్న పత్రికల పట్ల ఉన్న ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలన్నారు. జర్నలిస్టులకు గృహవసతి కల్పిస్తామన్న హామీ నాలుగేళ్లు గడిచినా అమలు కాలేకపోవడం బాధాకరమన్నారు. హెల్త్ కార్డులు కూడా సక్రమంగా అమలు కావడం లేదని తెలిపారు. ఇప్పటివరకు డెస్క్, రిటైర్డ్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందలేదన్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లా కేంద్రాలలో గృహ వసతి కల్పిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు.

సమావేశంలో సీనియర్ జర్నలిస్టు, మాజీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి పార్టీలతో పాటు జర్నలిస్టులు పోషించిన పాత్ర మర్చిపోవద్దన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన  హామీలు ఏవీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. మీడియాపై దాడిని తీవ్రంగా ఖండించారు. మీడియాపై భౌతిక దాడులకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అలా చేస్తే యూనియన్ చూస్తూ ఉరుకోదన్నారు. టివి9, ఎబిఎన్ ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు తొందరపాటు చర్య అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు.