Asianet News TeluguAsianet News Telugu

యువ జర్నలిస్టులకు రామచంద్రమూర్తి చురకలు

  • ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టు దిగ్గజం శ్రీకాంత్ సంస్మరణ సభ
  • హాజరైన రామచంద్రమూర్తి, సి.రామచంద్రయ్య, టంకశాల అశోక్.
  • రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన శ్రీకాంత్ శిష్యబృందం
journalist srikanth condolence meeting at somajiguda press club

జర్నలిస్టు దిగ్గజం, సాహితీవేత్త గుర్రంకొండ శ్రీకాంత్ సంస్మరణ సభ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగింది. ఈ సభలో సీనియర్ జర్నలిస్టు, సాక్షియ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, వార్త పత్రిక పూర్వ సంపాదకులు ఎడిటర్ టంకశాల అశోక్, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, 99 టివి ఎడిటర్ కె.అజిత, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజమౌళి చారి, టియుడబ్ల్యుజె నేత పల్లె రవి, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, మంజరి హాజరయ్యారు. అలాగే శ్రీకాంత్ సతీమణి కుసుమ శ్రీకాంత్, శ్రీకాంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. శ్రీకాంత్ శిష్యబృందం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

గుర్రంకొండ శ్రీకాంత్ దశాబ్ద కాలం పాటు వార్త ఇనిస్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం (విఐజె) ప్రిన్సిపాల్ గా సేవలందించారు. ఆయన దగ్గర జర్నలిజం పాఠాలు నేర్చుకున్న వారిలో ఎక్కువ మంది అప్పటి జర్నలిజం విద్యార్థులు ఈ సంస్మరణ సభలో పాల్గొన్నారు.

journalist srikanth condolence meeting at somajiguda press club

99 టివి ఎడిటర్ అజిత అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రమూర్తి మాట్లాడుతూ శ్రీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తి శ్రీకాంత్ అని కొనియాడారు. 1995 మే 25వ తేదీన ఉదయం పత్రిక మూసివేసిన తర్వాత దాన్ని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు ఎన్నో జరిగాయని రామచంద్రమూర్తి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో దాన్ని రీఓపెన్ చేసేందుకు మాజీ మంత్రి సి.రామచంద్రయ్యతోపాటు తాను, తన టీం లో శ్రీకాంత్ కూడా ఉన్నారని గుర్తు చేశారు. సమాజం గురించి పట్టింపు ఉన్న వ్యక్తి శ్రీకాంత్ అని కొనియాడారు. తన రూమ్ లోకి డైరెక్ట్ గా ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండా వచ్చి ఎంతసేపైనా ఉండి మాట్లాడే స్వేచ్ఛ ఉన్న జర్నలిస్టు శ్రీకాంత్ అని పేర్కొన్నారు. తాను వార్త ఎడిటర్ గా ఉన్న కాలంలో శ్రీకాంత్ ఎలాంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాలు ముక్కుసూటిగా చెప్పేవారని గుర్తు చేశారు. వామపక్ష మేధావిగా శ్రీకాంత్ నిలిచిపోయారని కొనియాడారు. శ్రీకాంత్ జీవితమంతా రచనలకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని అభినందించారు. జర్నలిజంలో ఫలానా వారి శిష్యులం అని చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడే రోజులు కావని చెప్పారు. అదికూడా ఎలక్ట్రానిక్ మీడియా విస్తరించిన ఈ రోజుల్లో శిష్యులు అని చెప్పుకోవడం అసలే ఇష్టపడడంలేదన్నారు. తమకే అన్ని తెలుసు అన్న ధోరణి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. నేడు ఇంత మంది జర్నలిస్టులు శ్రీకాంత్ శిష్య బృందం అని చెప్పుకుంటూ సంస్మరణ సభ జరపడం అభినందించదగిన పరిణామం అన్నారు. శ్రీకాంత్ వాతావరణంలో ఉన్న కాలుష్యానికి గురి కాకుండా చివరి వరకు విలువలు, వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న గొప్ప జర్నలిస్టు అని కొనియాడారు. శ్రీకాంత్ చివరి వరకు గొప్ప హేతువాదిగా బతికారని గుర్తు చేశారు.  శ్రీకాంత్ లాంటి వ్యక్తుల సంఖ్య జర్నలిజంలో పెరగాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. ప్రెస్ క్లబ్ లో సాయంత్రం కార్యక్రమాలు కాకుండా పగలు కార్యక్రమాలు పెరగాలన్నారు. చర్చలు, డిబేట్స్ జరపాలని సూచించారు. కరెంట్ ఎఫైర్స్ మీద నిరంతరం చర్చలు జరపాలని సూచించారు.

సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ శిష్య బృందం ఈ కార్యక్రమం చేపట్టడం అభింనందించదగిన పరిణామం అన్నారు. చివరి వరకు తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న అరుదైన వ్యక్తి శ్రీకాంత్ అని చెప్పారు. శ్రీకాంత్ ను అనుసరించడమే కాదు ఆయన లక్షణాలను అలవర్చుకోవాలని జర్నలిస్టులకు సూచించారు. జర్నలిజం స్కూల్ ను స్కూల్ గా, కోర్సు మాదిరిగా నడపకుండా ఒక గురుకులం మాదిరిగా నడిపిన వ్యక్తి శ్రీకాంత్ అని అభినందించారు. సిలబస్ తో సంబంధం లేకుండా జర్నలిజాన్ని ఒక కల్చర్ మాదిరిగా విద్యార్థులకు నేర్పించారని చెప్పారు. ఏదో క్లాసలు చెప్పామా? పరీక్షలు పెట్టి పంపించేశామా అన్నట్లు కాకుండా జర్నలిజం స్టూడెంట్స్ కు అన్నీ దగ్గరుండి తండ్రి మాదిరిగా బోధించారని కొనియాడారు.

సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, మాజీ ఎంపి సి.రామచంద్రయ్య మాట్లాడుతూ శ్రీకాంత్ కు హిస్టారికల్ నాలెడ్జీ గొప్పగా ఉండేదన్నారు. ఆయన వల్ల తనకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఏనాడైనా చట్టసభలో తాను మాట్లాడినదానిలో ఏమైనా లోపాలుంటే వెంటనే తనను కలిసి వాటిపై క్లారిటీ ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. గుర్రంకొండ శ్రీకాంత్ ఎన్టీఆర్ పర్సనల్ సెక్రటరీగా పనిచేశారని, ఆ సమయంలో శ్రీకాంత్ ను ఎంతో ఇష్టపడేవారని చెప్పారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజమౌళి చారి మాట్లాడుతూ శ్రీకాంత్ పేరు మీద స్మారక లెక్చర్ ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పారు. గొప్ప జర్నలిజం గురువు శ్రీకాంత్ తో తాను కలిసి పనిచేయలేకపోవడం దురదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని, విద్య నేర్పిన గురువును మరచిపోరాదన్నారు. అలాగే జర్నలిజం గురువును మరచిపోకుండా సంస్మరణ సభ నిర్వహించిన శ్రీకాంత్ శిష్య బృందాన్ని అభినందించారు.

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఉపాధ్యక్షులు పల్లె రవి మాట్లాడుతూ పరిమితమైన వనరులు ఉన్న రోజుల్లో కూడా ఎంతో మంది జర్నలిస్టులను తీర్చిదిద్దిన ఘనత శ్రీకాంత్ కు దక్కిందన్నారు. శ్రీకాంత్ పేరు మీద ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు అవార్డులు స్తే బాగుంటుందన్నారు. తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios