అందుకే కిషన్ రెడ్డికి టీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు.. ఈటల పార్టీని బలహీనపరిచారు: జిట్టా
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిపై తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీలో మరో నాయకుడు ఎదగొద్దనేది కిషర్ రెడ్డి ఆలోచన అంటూ విమర్శలు గుప్పించారు.

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిపై తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలకృష్ణ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. తనను ఎందుకు సస్పెండ్ చేశారనేది చెప్పలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్ రెడ్డి తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. కిషన్ రెడ్డి సమైక్యవాది అంటూ ఆరోపణలు చేశారు. బీజేపీలో మరో నాయకుడు ఎదగొద్దనేది కిషర్ రెడ్డి ఆలోచన అంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారంటూ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసిన బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యత నుంచి కుట్రలో భాగంగానే తప్పించారని ఆరోపణలు చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను తిట్టిన రఘునందన్ రావును కిషన్ రెడ్డి సంకలో పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాకు లీకులు ఇచ్చి బీజేపీని బలహీనపరిచారని విమర్శించారు. తనను సస్పెండ్ చేయడం కంటే ముందు చాలా మందిని సస్పెండ్ చేయాల్సి ఉందన్నారు.
ఇక, జిట్టా బాలకృష్ణారెడ్డి.. తెలంగాణ ఉద్యమకారుడిగా, యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.గత ఏడాది ఢిల్లీలో అప్పటి బీజేపీ చీఫ్ బండి సంజయ్ తదితరుల సమక్షంలో తన అనుచరులతో కలిసి యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అప్పటి నుంచి బీజేపీలో కొనసాగిన ఆయన.. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో బీజేపీ విధానాలను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జిట్టా బాలకృష్ణారెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై వేటు వేసింది. ఇక, జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమవుతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.