మరో వివాదంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Jangoan mla muttireddy yadagirireddy controversial statement of sc st bc reservations
Highlights

  • ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు రద్దు చేయాలి
  • రెడ్డీలు విద్య, ఉద్యోగాలకు దూరమవుతున్నారు
  • పదేళ్ల కోసమే రిజర్వేషన్లు, ఇంకెన్నాళ్లు ఉంటాయి

వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. తాజాగా ఆయన మరో వివాదాస్పద ప్రకటన చేసి చిక్కుల్లో పడ్డారు. జనగామ జిల్లాలో జరిగిన రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో పాల్గొని వివాదాస్పదన ప్రకటనలు చేశారు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఆయన ఏం మాట్లాడారో కింద చదవండి.

జనగామ జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్ లో జరిగిన సమావేశంలో ముత్తిరెడ్డి రిజర్వేషన్లపై కీలక ప్రకటనలు గుప్పించారు. రిజర్వేషన్ల కారణంగా 90శాతం మార్కులు వచ్చిన రెడ్డీలు సైతం విద్య, ఉద్యోగ రంగాల్లో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ఉన్న రిజర్వేషన్లు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు తొలగిస్తేనే రెడ్డిలకు న్యాయం జరగుతుందని కుండబద్ధలు కొట్టారు. 

ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు కేవలం పదేళ్ల కోసమే రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయని గుర్తు చేశారు. ప్రభుత్వాలు మాత్రం రిజర్వేషన్లు పొడిగించుకుంటూ పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రెడ్డి యువత విద్య, ఉద్యోగ రంగాలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్డి యువతకు 90 శాతం మార్కులొచ్చినా అవకాశాలు రావడంలేదని... రిజర్వేషన్ల కారణంగా అంతకంటే తక్కువ మార్కులొచ్చినా ఇతర వర్గాలకు ఉన్నత చదువులు, ఉద్యోగాలు వస్తున్నాయని ఆక్రోశం వ్యక్తం చేశారు. 

ఆదినుంచీ వివాదాల్లోనే... ముత్తిరెడ్డి

ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదినుంచీ వివాదాల్లోనే ఉన్నారు. స్వయంగా ఆయన చేసిన అవినీతిపై జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన తీవ్రమైన విమర్శలు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అక్రమాలను, భూకబ్జాలను తాను ఎంతో కష్టపడి ఆపేస్తున్నానని ఆమె వెల్లడించారు.. చెరువు భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేయడంలో ముత్తిరెడ్డి పేరుగాంచారు. ముత్తిరెడ్డిపై జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. టిఆర్ఎస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టేశాయి.

అయితే ఉస్మానియా యూనివర్శిటీ భూములను కూడా ముత్తిరెడ్డి కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ భూముల్లో హోటల్ నిర్మించినట్లు విద్యార్థులు నేటికీ ఆందోళన చేస్తుంటారు. ఇక ఇదేకాకుండా హైదరాబాద్ లో ఒక వెంచర్ వేసిన ముత్తిరెడ్డి కొనుగోలు దారులకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా వేధించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో బాధితులంతా ఏకంగా ముత్తిరెడ్డి ఇంటినే ముట్టడించి ఆందోళన చేశారు. తాజాగా మరోసారి ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ముత్తిరెడ్డి సంచలన వివాదాస్పద ప్రకటనలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

గ్రంథాలయ ఛైర్మన్ మాటలపై వివాదం
రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా శాఖ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఎడవల్లి కృష్ణారెడ్డి ప్రసంగంపై సభలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా కేసీఆర్‌ పాలన ఉందంటూ కృష్ణారెడ్డి ప్రసంగిస్తుండటంతో ఆయన ప్రసంగానికి పలువురు రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగాన్ని ఆపాలని నిరసన వ్యక్తం చేశారు. ఒక కుల సంఘ సమావేశంలో రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు అని నిలదీశారు.  దీంతో కృష్ణారెడ్డి తన ప్రసంగాన్ని ముగించి కూర్చున్నారు.
 

loader