భారీ నీటిపారుదల శాఖ మంత్రి హారీశ్ రావు తీరుపై జనగామ రైతులు మండిపడుతున్నారు. తమ సాగు భూములకు దక్కాల్సిన నీటిని వేరే చోటుకు తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. పోరాటాలు చేసి సాధించుకున్న దేవాదుల ప్రాజెక్టు ఫలాలు తమకు దక్కకుండా చేస్తే మరో పోరాటం చేయడానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు. 

తెలంగాణ కల సాకారమైనా కరువుపీడిత గడ్డ జనగామ రాత మాత్రం మారడం లేదు. నిజాం ను ఎదురించి సాయుధ పోరాటానికి నాంది పలికిన ఈ నేలపై ఇప్పుడు నీటి చుక్కకు కూడా దిక్కు లేకుండా పోయింది.

కాంగ్రెస్ హయాంలో జనగామ, చేర్యాల నియోజకవర్గ ప్రజలు పోరాటాలు చేసి దేవాదుల ప్రాజెక్టు ను సాధించుకున్నారు. అసలే నత్తనడకన సాగుతున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో ఎన్నో మలుపులు తిరుగుతోంది.

ఈ ప్రాజెక్టు కింద మల్లన్న గండి, ఉమ్మకూరు, తపాసుపల్లి రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. అయితే టీఆర్ఎస్ అధికారం చేపట్టాక మినీ రిజర్వాయర్లుగా ఉన్న వీటి కింది ఫీడర్ చానెల్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది.

భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావే స్వయంగా ఈ ఫీడర్ చానెల్ నీటిని తమ నియోజకవర్గాలకు తరలించుకపోతున్నారు.

ఇందులో భాగంగా తపాసుపల్లిని మాత్రమే గోదావరి జలాలతో నింపుకొని తన నియోజకవర్గం సిద్దిపేట, సీఎం నియోజకవర్గం గజ్వెల్ ను సుభిక్షం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

వీటి మధ్యలో ఉన్న నర్మెట, బచ్చన్నపేట, చేర్యాల, మద్దూరు ప్రాంత రైతులు సాగు చేసుకునేందుకు చుక్క నీటిని కూడా విదిలించకుండా శరవేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయిస్తున్నారు.

దీంతో జనగామ రైతులు మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా జేఏసీ నేత, జనగామ జిల్లా సామాజిక కార్యకర్త బాలలక్ష్మీ ఆధ్వర్యంలోని స్థానిక రైతులు ఈ రోజు ప్రాజెక్టు పనులు జరుగుతున్న స్థలం వద్ద మంత్రి తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

తమ ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టి నీటిని తరలించేందుకు హరీష్ రావు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. మండల స్థాయి అఖిలపక్ష నేతలతో కలిసి జేఏసీగా ఏర్పడి తమ నీటి వాటాను దక్కించుకుంటామని ప్రకటించారు.