సిఎం కేసిఆర్ తో పవన్ భేటీ

సిఎం కేసిఆర్ తో పవన్ భేటీ

తెలంగాణ సిఎం కేసిఆర్ తో  ఫిల్మ్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లోని కేసిఆర్ నివాస గృహంలో వీరి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలకమైన అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. సిఎం కేసిఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పవన్ ప్రగతి భవన్ వెళ్లినట్లు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అదే సమయంలో సిఎం కేసిఆర్ గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్ భవన్ వెళ్లారు. పవన్ ను కేసిఆర్ నివాసంలోనే కొద్దిసేపు కూర్చోబెట్టారు. సిఎం వచ్చిన తర్వాత ఈ సమావేశం జరిగింది.

అయితే ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ సినీ స్టార్స్ మాదిరిగానే పవన్ కళ్యాన్ కు కూడా ఆహ్వానం పంపింది తెలంగాణ సర్కారు. అయితే కారణాలేమైనా పవన్ తెలుగు సభలకు హాజరు కాలేదు. దిగ్గజ నటులంతా హాజరయ్యారు. తుదకు పవన్ అన్న చిరంజీవి కూడా తెలుగు సభల వేదిక పంచుకున్నారు.

అయితే పవన్ తెలుగు సభలకు హాజరుకాలేకపోయిన నేపథ్యంలో ఇవాళ సిఎం కేసిఆర్ ను ప్రత్యేకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణలోని పరిస్థితులు, ఎపి రాజకీయ అంశాలపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలియవచ్చింది. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా లేదా అన్న విషయంలో కూడా ఇద్దరి మధ్య చర్చ జరగొచ్చా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఒకవేళ జనసేన తెలంగాణలో పోటీ చేయకపోతే.. ఎవరికి మద్దతిస్తారన్నదానిపైనా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కు ఎపిలోనే కాకుండా తెలంగాణలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. యూత్ లో పవన్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తెలంగాణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది.

.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos