తెలంగాణ సిఎం కేసిఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష నేత జానారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కేసిఆర్ తిట్లను, ధూషనలను ఒక్కమాటతో కొట్టి పారేశారు జానారెడ్డి. మరి జానారెడ్డి మీడియాతో ఏమన్నారో చదవండి.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ నడిచే తీరు వికారంగా ఉంది. ఈ సభను చూసి నేను మానసిక సంఘర్షణ పడుతున్నాను. ఎథిక్స్ కమిటీ లో చర్చించలేదు. సభ్యుల వివరణ అడగలేదు. కానీ ఇద్దరు ఎమ్యెల్యే లను అనర్హులుగా ప్రకటించారు. ఇది ఎక్కడా ప్రొసీజర్స్ లో లేదు. గతంలో అసెంబ్లీ ఎంతో డీసెంట్ గా నడిచేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ కానే కాదు. కాంగ్రెస్ పార్టీ భారత దేశానికే హీరో. తెలంగాణకు నేను  ఏమి చేయలేదన్నారు కేసిఆర్. మరి నేను ఏమీ చేయకపోతే ..అప్పుడు కేసీఆర్ నా ఇంటికి ఎందుకు వచ్చారో సమాధానం చెప్పాలి. తెలంగాణ లో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ దే. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ బ్రష్టు పట్టిస్తున్నారు. మోసాలు, కుట్రల చరిత్ర మాది కాదు కేసీఆర్ దే. కెసిఆర్ నోరు తెరిచి అస్తమానం తిట్లు తిట్టడం కాదు ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే ..ఇప్పుడు సీఎం గా కేసీఆర్ మాట్లాడేవారే కాదు. అసెంబ్లీలో ప్రభుత్వం ఆన్ డెమొక్రాటిక్ గా వ్యవహరించింది. నాలుగేండ్లు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము ఉన్నాం. కానీ ప్రభుత్వంలో ఆ వివేచన కనిపించడం లేదు. నేను మనవతావాదిగా, రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతాను. కేసీఆర్ లా నీచమైన భాషలో కాదు.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్త ఏందో కేసీఆర్ కు చూపుతాం. యుపి ఉప ఎన్నికల్లో సీఎం సొంత నియోజకవర్గంలోనే బీజేపీ ని చిత్తుచిత్తుగా ఓడించారు. కేసీఆర్ యుపి ఫలితాలను గుర్తెరిగి మసలుకోవాలి. మూకుమ్మడి రాజీనామాలపై నా దగ్గర చర్చకు రాలేదు. మూకుమ్మడి రాజీనామాలు అనే ప్రస్తావన లేదు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు అంత ఈజీగా రావు. కాంగ్రెస్ పార్టీ ఓ కుటుంబం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. వివేచన, విచక్షణతో రాజకీయ పార్టీలు పోరాడాలి. లేకపోతే సంఘర్షణ తలెత్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.

వచ్చే మా ప్రభుత్వంలో మీడియా పై ఆంక్షలుండవు. ప్రజాస్వామ్య హితంగా పాలన ఉంటుంది. ఇచ్చిన హామీలను అమలుచేయని కేసీఆర్ ..కాంగ్రెస్ ఇస్తాన్న రెండు లక్షల రుణమాఫీ పై మాట్లాడటం హాస్యాస్పదం. దేశ వ్యాప్తంగా రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ది.