నల్గొండ: మా పార్టీని చావు నోట్లో పెట్టి తెలంగాణను సాధించామని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ప్రకటించారు. గురువారం నాడు ఆయన నాగార్జునసాగర్ లో  ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఒక్కరే త్యాగం చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాల్ని ఫణంగా పెట్టానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.  మా పార్టీనే ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదని ఏపీకి చెందిన మంత్రులు రాజీనామా చేస్తే  ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణకు చెందిన మంత్రులను కూడగట్టి రాజీనామాలు చేయించానని ఆయన గుర్తు చేశారు.  ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని సోనియాను కోరినట్టుగా ఆయన చెప్పారు.

ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని సోనియాగాంధీ హామీ ఇచ్చిన తర్వాతే తాము రాజీనామాలను వెనక్కి తీసుకొన్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని చెప్పినా కూడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే తనకు ముఖ్యమని సోనియాగాంధీకి తాను తేల్చి చెప్పినట్టుగా జానారెడ్డి గుర్తు చేసుకొన్నారు.

 మంత్రి పదవి ఇవ్వాలని తాను ఎవర్నీ అడగలేదన్నారు. మండలకేంద్రాల  ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషించినట్టుగా ఆయన చెప్పారు. మావోయిస్టులతో చర్చలకు కూడా తానే కారణమని ఆయన వివరించారు. పదవుల కోసం తాను ఏనాడూ కూడా పాకులాడలేదన్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా తాను ఏనాడూ కూడా ప్రయత్నించలేదని చెప్పారు. తెలంగాణ సాధనకు బీజేపీ కూడ సహకరించిందని ఆయన తెలిపారు. జేఏసీ మా ఇంట్లోనే పురుడు పోసుకొందని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన కోసం ఎందరో విద్యార్ధులు, యువకులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆయన గుర్తు చేసుకొన్నారు.