Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాకు ఆమోదం

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి రాజీనామాను జిల్లా కలెక్టర్ రవి ఆమోదించారు. 

jagtial municipal chairperson Boga Shravani Resignation Accepted
Author
First Published Jan 30, 2023, 6:07 PM IST

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి రాజీనామాను జిల్లా కలెక్టర్ రవి ఆమోదించారు. ఈ నెల 25న మీడియా సమావేశం నిర్వహించిన భోగ శ్రావణి.. తాను జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శ్రావణి రాజీనామా ఆమోదంపై తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ రవి.. శ్రావణిని కలెక్టరేట్కు పిలిపించారు. రాజీనామా కోసం ఒత్తిడి తో చేశారా...? లేక తన సొంత నిర్ణయం తీసుకున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. అయితే శ్రావణి క్లారిటీ ఇవ్వడంతో.. ఆమె రాజీనామాకు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఇక, మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌ శ్రీనివాస్‌కు ఇంఛార్జ్‌గా బాధ్యతలను అప్పగించారు.

ఇక, ఇటీవల స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు తాళలేక రాజీనామా చేస్తున్నట్టుగా భోగ శ్రావణి తెలిపారు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ.. పలుమార్లు కన్నీటిపర్యంతరమయ్యారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో.. ఎన్నో అవమానాలను ఎదుర్కొని కూడా విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. తనకు పదవి దక్కేందుకు కారణమైన సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, మంత్రి కేటీఆర్‌లకు శ్రావణి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.  

పెద్దల ఆశీస్సులతో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి దక్కిందని.. కానీ మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నానని చెప్పారు. తాను పేరుకే మున్సిపల్ చైర్‌పర్సన్ అని పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనని అన్నారు. పలు సందర్భాల్లో నలుగురు తిట్టినా  కూడా భరించానని చెప్పుకొచ్చారు. పార్టీ కోసమే తాను ఇన్నాళ్లు కట్టుబడి పని చేశామని చెప్పారు. అయితే కుటుంబంపై బెదిరింపులకు దిగడంతోనే తాను మీడియా ముందు వచ్చానని చెప్పారు. తన పదవికి రాజీనామా చేసినప్పటికీ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని తెలిపారు. 

‘‘దొర మీకో దండం.. నాకు పెద్దలు ఆశీర్వాదంగా ఇచ్చిన చైర్‌పర్సన్ పదవికి ఈ చీకటి రోజున రాజీనామా చేస్తున్నారు. డాక్టర్ సంజయ్ కుమార్ దొర మీకు దండం. మీ గడి నుంచి నేను ఈరోజు బయటపడుతున్నాను. మీరే గెలిచారు. బీసీలు ఉన్నత పదవులకు పనికిరారు’’ అని శ్రావణి మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. తన కుటుంబానికి ఏం జరిగినా ఎమ్మెల్యే సంజయ్‌దే బాధ్యత అని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios