Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో వృద్దుడికి కరోనా: అప్రమత్తమైన అధికారులు

జగిత్యాల జిల్లాకు చెందిన క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడైన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసలు అతనికి వైరస్ ఎలా సోకిందన్న విషయంపై ప్రస్తుతం కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. 
 

Jagtial man tests positive, Karimnagar put on alert
Author
Karimnagar, First Published May 10, 2020, 4:35 PM IST

జగిత్యాల:జగిత్యాల జిల్లాకు చెందిన క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడైన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసలు అతనికి వైరస్ ఎలా సోకిందన్న విషయంపై ప్రస్తుతం కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. 

అనారోగ్యానికి గురైన ఆ పేషెంట్ మొదట జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత కరీంనగర్‌లోని ఓ ల్యాబ్‌లో టెస్ట్‌లు చేయించుకుని చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో నాలుగు రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత నిమ్స్‌కు తరలించి పరీక్షలు చేయించగా అతనికి కరోనా సోకినట్టు తేలింది. 

also read:యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం: నాలుగు పాజిటివ్ కేసులు

అయితే ఆ వృద్ధుడికి కరోనా పాజిటివ్ రావడానికి గల కారణాలు ఏంటి? ఇప్పటివరకు అతన్ని ఎవరెవరు కలిశారు? అనే విషయాలపై రెండు జిల్లాల అధికారులు ఆరా తీస్తున్నారు. మొదట అతనే ముంబయి ప్రాంతానికి వెళ్లొచ్చాడని ప్రచారం జరిగింది కానీ, అతడు చాలా కాలం కిందటే ముంబయి నుంచి ఇక్కడకు వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

ఆ తర్వాత అతని బంధువు ఒకరు ముంబయి నుంచి మార్చి మొదటి వారంలో ఇక్కడకు వచ్చాడని తెలుసుకున్న అధికారులు అతన్ని కూడా పరీక్షించారు. అతనికి నెగెటివ్ వచ్చింది. రెండు నెలలు దాటినా కూడా ఆ యువకునిలో కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో బాధితునికి వ్యాధి ఎలా సోకిందో అధికారులకు అర్థం కాకుండా పోయింది. 

జగిత్యాల ఆస్పత్రికి వెళ్లివచ్చినప్పుడు సోకిందా లేక కరీంనగర్‌లోని ల్యాబ్‌కు వెళ్లినప్పుడు ఎవరినైనా కలిశారా లేక చల్మెడ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కొవిడ్ 19 బాధితులు కలిశారా అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

వృద్ధునికి కరోనా పాజిటివ్ వచ్చి ఐదు రోజులు కావస్తున్నా అతన్ని కలిసిందెవరన్న విషయం తేలకపోవడం అధికారులకు సమస్యగా మారింది. కరోనా బాధితుడే అతన్ని కలిసినట్టుగా గుర్తిస్తే వెంటనే అతనితో పాటు కాంటాక్ట్ అయినవారి వివరాలు సేకరించి వారందరినీ క్వారంటైన్ చేయాల్సి ఉన్నందున అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా అసలు కారణం తెలుసుకోవాలన్న సంకల్పంతో రెండు జిల్లాల వైద్య శాఖ అధికారులు తమ విచారణను కొనసాగిస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios