ఇందాక జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేసులో తానూ ఉన్నానని ప్రకటించుకుంటూనే, ఇంకా ఎవరెవరికి ఆస్కారముందో చెప్పాడు. ఈ సందర్భంగా బొల్లు కిషన్ కూడా పీసీసీ చీఫ్ కాగలడని అన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ బొల్లు కిషన్ ఎవరు అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. 

బొల్లు కిషన్ విద్యార్ధి దశలో ఎన్ ఎస్ యూ ఐ లో ఆక్టివ్ గా ఉండేవాడు. 1986లో ఇలా విద్యార్ధి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆతరువాత యూత్ కాంగ్రెస్ లో చేరాడు, దాని తరువాత కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించాడు. 

ప్రస్తుతానికి టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా కొనసాగుతున్నాడు. గతంలో సర్వ్ సత్యనారాయణ వైఖరిపై టీవీ లైవ్ కి ఫోన్ చేసి మరి విరుచుకుపడ్డాడు. ఆ తరువాత జనవరి లో పీసీసీ మీటింగ్ లో ఉత్తమ్, సర్వ్ సత్యనారాయణల మధ్య జరిగిన గొడవలో సర్వేను కిషన్ అడ్డుకున్నాడు కూడా. ఆ సందర్భంగా వీరిరువురు మధ్య తోపులాట కూడా జరిగింది. 

ఇక తాజాగా పార్లమెంటు ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షా పదవికి రాజీనామా చేసినప్పుడు, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హల్చల్ చేసాడు. ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లా ఇంచార్జి గా కొనసాగుతున్నాడు. 

గతంలోనే జగ్గా రెడ్డి తాను కూడా పీసీసీ  రేసులో ఉన్నానని ప్రకటించాడు. ఆ సందర్బంగా కాంగ్రెసు పార్టీపై జగ్గా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం తాను సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 20వ తేదీ తర్వాత తాను సోనియా, రాహుల్ గాంధీలను కలుస్తానని చెప్పారు. 

టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పది మంది ప్రయత్నిస్తున్నారని, తాను 11వ వాడినని ఆయన చెప్పారు. తనకు అధ్యక్ష పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, పార్టీ విజయం కోసం పూర్తి కాలం పనిచేస్తానని ఆయన చెప్పారు. 

Also Read: అన్ని పార్టీలు తిరిగా....వారిని నిలువరించే దమ్ముంది, పీసీసీ చీఫ్‌ పదవిపై జగ్గారెడ్డి కన్ను

తనకు అధ్యక్ష పదవి ఇస్తే సంగారెడ్డి నుంచి వేరేవాళ్లను పోటీ చేయించి గెలిపిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణ పిసిసీ అధ్యక్ష పదవి కోసం జగ్గారెడ్డి ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో తనపై ఉన్న కేసుల వివరాలను కూడా పొందుపరిచారు.

తెలంగాణ పిసిసీ అధ్యక్ష పదవి నుంచి నల్లగొండ లోకసభ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ రెడ్డి సహా పలువురు పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డికి పాత సీనియర్ కాంగ్రెసు నేతల నుంచి వ్యతిరేకత ఎదరవుతోంది.

తెలంగాణ పిసిసి పదవికి రెడ్లు, బ్రాహ్మణులు మాత్రమే కాదు, ఇతర కులాల వాళ్లు కూడా అర్హులేనని జగ్గారెడ్డి అన్నారు. వి. హనుమంతరావు పీసీసీ పదవికి సమర్థుడని ఆయన చెప్పారు. మాలల నుంచి మల్లు భట్టివిక్రమార్క, మాదిగల నుంచి దామోదర రాజనర్సింహ పిసిసి పదవికి అర్హులని ఆయన చెప్పారు. సాధారణ కార్యకర్త బొల్లు కిషన్ కూడా పిసిసి అధ్యక్షుడు కావచ్చునని ఆయన అన్నారు.