అన్ని పార్టీలు తిరిగా....వారిని నిలువరించే దమ్ముంది, పీసీసీ చీఫ్ పదవిపై జగ్గారెడ్డి కన్ను
టీపీసీసీ అధ్యక్ష పదవికి పలువురు నేతలు పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్ బాబు పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఇకపోతే పీసీసీ చీఫ్ పదవిని తాను ఆశిస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి సీడబ్ల్యూసీ సభ్యుడు గులాం నబీ ఆజాద్ ఎదుట తన మనసులో మాట చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై ఎన్నాళ్ల నుంచో కన్నేసిన జగ్గారెడ్డి తన మనసులోని మాటను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరుతూ జగ్గారెడ్డి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. తనకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు అలాంటి వారి సరసన జగ్గారెడ్డి కూడా చేరిపోయారు.
పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ చెప్పినట్లు కొత్త చీఫ్ ఎంపికకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో మంచి పాలన రావాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని, తాను లోక కళ్యాణం కోసమే పీసీసీ పదవి అడుగుతున్నాని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనకు ఒకవేళ అవకాశం ఇస్తే పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.10 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా చేస్తానని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి మెడిసన్ కావాలో అది తన దగ్గర ఉందని చెప్పుకొచ్చారు. ఎవరికి వారు హీరో అనుకుంటే నడవదని ఇతర నేతలకు చురకలు అంటించారు జగ్గారెడ్డి.
అన్ని వర్గాలు, మతాలకు కాంగ్రెస్ ప్రాధాన్యతనిస్తుందనితాను భావిస్తున్నట్లు తెలిపారు. తన జీవితం ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభమైందన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లలో తాను పని చేశానని అయితే వారిని ఎలా తట్టుకోవాలో తనకు తెలుసునన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ రాచరిక పాలనను నిలదీసే ధైర్యం ఆ పార్టీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని, ఎవరు తప్పు చేసినా నిలదీసే హక్కుతో పాటు అవసరమైతే పదవి నుంచి తొలగించే అధికారం కూడా ఉంటుందని వెల్లడించారు.
తాను బహిరంగంగా అన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నానని అందువల్లే లేఖలు రాసినట్లు చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఇప్పటికే తన పూర్తి బయోడేటా వివరాలను సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్ వంటి కీలక నేతలందరికి రిజిస్టర్‌లో పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఒకవేళ తనకు పీసీసీ పదవి లభిస్తే ఎటువంటి షరతులు లేకుండా సోనియా, రాహుల్ సూచనల మేరకు పనిచేస్తానని తెలిపారు.
డబ్బు ఉంటేనే అధిష్టానం పీసీసీ పదవి ఇస్తుందనేది అవాస్తవమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గతంలో డబ్బు లేకున్నా డి. శ్రీనివాస్, కేశవరావు వంటి వ్యక్తులకు పీసీసీ పదవులు లభించలేదా అని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో లాబీయింగ్ ఉన్నా క్యారెక్టర్‌ను కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు.
టీపీసీసీ అధ్యక్ష పదవికి పలువురు నేతలు పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్ బాబు పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఇకపోతే పీసీసీ చీఫ్ పదవిని తాను ఆశిస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి సీడబ్ల్యూసీ సభ్యుడు గులాం నబీ ఆజాద్ ఎదుట తన మనసులో మాట చెప్పారు.
పీసీసీ చీఫ్ ఎంపికలో సమతుల్యత పాటించాలని, వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు బూస్టింగ్ ఇచ్చే లీడర్ ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని ప్రచారం. ఇలాంటి తరుణంలో జగ్గారెడ్డి కామెంట్స్, లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆ హామీ ఇవ్వండి, కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తా: ఎంపీ కోమటిరెడ్డి ఆశలు