టీపీసీసీ నూతన చీఫ్ ఎంపికకు సంబంధించి ఇటీవల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. సోనియా గాంధీకి పంపిన జాబితాలో కనీసం తన పేరు కూడా లేదని.. ఆ విషయం తనను చాలా బాధపెట్టిందని ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పేర్కొన్నారు.

ఈ మేరకు గురువారం ఆయన ఏఐసీసీ కార్యాలయానికి, రాహుల్‌గాంధీకి సందేశం పంపారు. అయితే సోనియా, రాహుల్‌గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నాస్వాగతిస్తామని పేర్కొన్నారు. పార్టీలో ఉన్న నాయకులు చీలిపోకుండా నిర్ణయం జరగాలని ఆశిస్తున్నానన్నారు. 

2017లో సంగారెడ్డిలో రాహుల్‌గాంధీ భారీ బహిరంగ సభను రూ.కోట్ల వ్యయంతో విజయవంతంగా నిర్వహించానని గుర్తు చేశారు. కానీ తన పేరు సోనియా, రాహుల్‌ వద్ద చర్చలో లేకపోవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. పార్టీ ఇన్‌చార్జి ఈ కార్యక్రమాల గురించి తెలుసుకోకపోవడం, తనలాంటి ఆర్గనైజర్‌ పేరును జాబితాలో చేర్చలేదని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్ పదవి కొమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత రేవంత్ రెడ్డికి ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. కాగా.. తర్వాత కోమటి రెడ్డికే ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.