హైదరాబాద్: తాను కూడ పీసీసీ రేసులో ఉన్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీ, పార్టీ నేత రాహుల్ గాంధీకి ఆయన లేఖ పంపారు. ఇవాళ ఆయన పార్టీ నాయకత్వానికి లేఖను పంపారు.

పీసీసీ మార్పు జరిగితే తనకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ నాయకుల సహకారంతో పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మండల, జిల్లా స్థాయి వరకు సమయం ఇచ్చి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

అవసరమైతే గ్రామాల్లో కూడ పర్యటించనున్నట్టుగా ఆయన చెప్పారు. తన స్టేట్‌మెంట్ తో కొందరు గందరగోళ పడుతున్నారని ఆయన పార్టీలోని తన వ్యతిరేకులపై ఆయన సెటైర్లు వేశారు. తన ప్రతి మాట వ్యూహాత్మకంగా ఉంటుందన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం తాను డిల్లీకి వెళ్లి పైరవీ చేయనని తేల్చి చెప్పారు.

తన వ్యక్తిత్వం కొందరికి తెలియక తనను టీఆర్ఎస్ కోవర్టంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ గురించి ఎవరూ కూడ మాట్లాడని రోజుల్లోనే తాను విమర్శలు చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

ఇవాళ చాలా మంది కేసీఆర్ గురించి ఫేస్‌బుక్ లో మాట్లాడుతున్నారన్నారు. తాను నిక్కర్లు వేసుకొన్నప్పటి నుండే  రాజకీయాలు మొదలుపెట్టినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. ఫేస్ బుక్ పిచ్చోళ్లకు కొందరు లీడర్స్ పైసలు ఇచ్చి మాట్లాడిస్తున్నారని ఆయన విమర్శించారు.

also read:సీఎల్పీ సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ

ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గాదేవితో పోల్చారని ఆయన గుర్తు చేశారు. ఇందిరాగాంధీని పొడిగిన వాజ్ పేయ్ తగ్గినట్టా అని ఆయన ప్రశ్నించారు. ఫేస్ బుక్ లో తనపై విమర్శలు చేసిన వాళ్లు.. మీ పేరు ఫోన్ నెంబర్ పెట్టండి... మీ ఇంటికి వచ్చి మీ అనుమానాలు తీరుస్తానని ఆయన చెప్పారు.