Asianet News TeluguAsianet News Telugu

పార్టీలో ఇబ్బంది ఉంది.. రేవంత్ రెడ్డి పీసీసీ హోదా మరిచి మాట్లాడుతున్నారు: జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఇబ్బంది ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పది మంది కూడా కూర్చొలేని పరిస్థితి ఉందని చెప్పారు.

Jagga Reddy Sensational Comments On Revanth Reddy And PCC
Author
First Published Nov 19, 2022, 1:22 PM IST

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఇబ్బంది ఉందని అన్నారు. శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు మహేష్ గౌడ్ తనకు ఫోన్ చేశారని చెప్పారు. జూమ్ మీటింగ్ ఉందని చెప్పారని.. అయితే అలా చెప్పగానే తనకు కోపం వచ్చిందని అన్నారు. పీసీసీ, సీఎల్పీ సమన్వయం చేయాలని సూచించారు. తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ఇదేమైనా ఐటీ కంపెనీలా.. ఇళ్లలో కూర్చొని మాట్లాడుకోవడానికి అని ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ పద్దతి మంచిది కాదన్నారు. ఇలా అయితే కష్టమని చెప్పారు. పీసీపీ అధ్యక్షుడిది కూడా తప్పేనని విమర్శించారు. వారం, పది రోజులకోకసారి మీటింగ్ అని చెప్పారని.. అసలు మీటింగులే పెట్టడం లేదని అన్నారు. అందరూ గాంధీ భవన్‌లో కూర్చొని చర్చించాలని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో ఉన్న పది మంది కూడా కూర్చొలేని పరిస్థితి ఉందన్నారు. దీనికి తాను కూడా బాధ్యుడినేనని చెప్పారు. భవిష్యత్తులో పీసీసీ అవకాశం ఇస్తే.. అన్ని చేస్తానని తెలిపారు. తనకు పీసీసీ అవకాశం ఇస్తే తన దగ్గర మెడిసిన్ ఉందని చెప్పారు. ఎన్నికల ముందు పీసీసీని మార్చమని తాను చెప్పడం లేదన్నారు. మీడియాలో వచ్చినట్టుగా మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే  కాంగ్రెస్‌కు నష్టమేనని చెప్పారు. దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కదేనని తెలిపారు. పాదయాత్రలో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్‌ షో చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆయన ఒక్కడే పనిచేస్తున్నానని బిల్డప్ ఇచ్చారని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమికి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. 

ఓటర్లకు డబ్బులిచ్చి చెడగొట్టింది రాజకీయ పార్టీలేనని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన జగ్గారెడ్డి.. 50 కోట్లు ఇచ్చిన వ్యక్తికి రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. పాల్వాయి స్రవంతికి ఆమె తండ్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి పేరుతో టికెట్ వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి పీసీసీ హోదా మరిచిపోయి టీవీల్లో మాట్లాడుతున్నారని విమర్శించారు.

Also Read: ఈ రోజు సాయంత్రం టీ కాంగ్రెస్ జూమ్ మీటింగ్.. పార్టీ నడిపే పద్దతి ఇది కాదని జగ్గారెడ్డి ఫైర్..!

తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ను ఉనికిలో లేకుండా చేసేందుకే బీజీపీ, టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు సమస్యలు, విద్యార్థుల సమస్యలపై రెండు ప్రభుత్వాలకు ఆలోచనే లేదని మండిపడ్డారు. ఒకరినొకరు గిచ్చుకుంటున్నారని.. టీఆర్ఎస్, బీజేపీలు తిట్టుకోవడం, కొట్టుకోవడం వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు  ఇస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ రెండు పార్టీలు నిరంతం కొట్టుకుంటూ ఉంటూ.. కాంగ్రెస్ కనిపించకుండా చేస్తున్నాయని మండిపడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios