నల్గొండ: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం జగన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. కేవలం కమీషన్ల కోసమే ఇన్నాళ్లు కేసీఆర్ మౌనంగా వున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్లుగా సీఎంగా ఉంటున్న కేసీఆర్ ఇంతకాలం ఏం   చేస్తున్నారంటూ కోమటిరెడ్డి నిలదీశారు. 

గత డిసెంబర్ లోనే ఏపీ అసెంబ్లీలోనే రాష్ట్రంలో 80వేల క్యూసెక్కుల విస్తరణ చేయనున్నట్లు  జగన్ చెప్పాడని...అప్పుడే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని అడిగారు. అప్పుడే స్పందించి వుంటే ఇంతవరకు వచ్చేది కాదన్నారు. 

''ఏపి ప్రభుత్వం విడుదలచేసిన జీవోపై మేము మాట్లాడాక కానీ కేసీఆర్ నోరు విప్పలేదు. కృష్ణా రివర్ బోర్డుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇన్నాళ్లు లేఖ ఎందుకు రాయలేదు. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ పై మాకు నమ్మకం లేదు'' అని అన్నారు. 

''ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ఎందుకు పూర్తి చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను మూలకు పడేసాడు. డిండి ఎత్తిపోతల పథకంలో 10 శాతం పనులు కూడా కాలేదు. దక్షిణ తెలంగాణలో పనికి రాని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లకు సీఎంను అడిగే ధైర్యం లేదు'' అని కోమటిరెడ్డి మండిపడ్డారు. 

''సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకే కేసీఆర్ సీఎంలా వ్యవహరిస్తున్నారు. గోదావరి, కృష్ణా అనుసంధానం పేరుతో మళ్ళీ 50,60 వేల కోట్ల కమిషన్లను పొందడానికే కేసీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నాడు'' అని ఆరోపించారు. 

''లాక్ డౌన్ ఎత్తేశాక కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలం ముగ్గురం కలిసి పీఎం మోడీకి ఈ విషయంపై ఫిర్యాదు చేస్తాం. ఆంద్రప్రదేశ్ లో మా పార్టీ 50 ఏండ్లు అయినా అధికారంలోకి రాదు. ఆశలు వదులుకున్నాం. తండ్రి రాజశేఖర్ రెడ్డి కంటే డబుల్ ఉన్నాడు జగ్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పోరాటం ఆగదు'' అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.