Jagadish Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 32వేల ఉద్యోగాలు ఇచ్చిందని, మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. దేశంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి నిలదీశారు. 

Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ బీ టీమ్‌గా పని చేస్తుందని ఆరోపించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినా పార్టీ నాయకులకు సోయిలేదనీ, పైగా..బీజేపీతోనే అంటకాగుతున్నారని విమర్శించారు. కోదాడలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో లీకేజీల పర్వానికి తెర తీశాయని, వాస్తవానికి దేశంలో నిరుద్యోగాన్ని పెంచి పోషించిందే బీజేపీ, కాంగ్రెస్‌లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలు.. ఇప్పుడూ నిరుద్యోగుల తరుపున మాట్లాడడం చాలా విడ్డురంగా ఉందని అన్నారు.

నిరుద్యోగ కారణమైన కాంగ్రెస్, బీజేపీలు.. వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో.. తాము 1.32లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. ఏక కాలంలో 23వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. మరో 90వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి ప్రక్రియ ప్రారంభం చేసి.. పరీక్షలు నిర్వహిస్తే.. ప్రశ్నపత్రాలను లీకేజీ చేసి.. కుట్రలకు తెర తీశారనీ, నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

2014 ఎన్నికలకు ముందు .. బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రతి యేటా రెండుకోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ పీఎం మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అదే ఎన్నికల ప్రచారంలో దేశంలో 25 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని.. అధికారంలోకి ఉన్నప్పుడు ఉద్యోగాలను భర్తీ చేయకుండా మాయ మాటలు చెప్పుతున్నారనీ, పీఎం మోదీ నిరుద్యోగులను నిండా ముంచారని విమర్శించారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ భర్తీ చేసిన విధంగా కేంద్రం తొమ్మిదేళ్లలో సంవత్సరానికి రెండుకోట్లు చొప్పున భర్తీ చేసి ఉంటే.. తెలంగాణ లోని ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ఉండేదని అన్నారు. తెలంగాణలో 1,32,649 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు అధికారికంగా గణాంకాల్లో వెల్లడిస్తున్నామని, అదేవిధంగా .. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఉత్తరప్రదేశ్‌లో కనీసం 10వేల మందికైనా ఉద్యోగ అవకాశాలు కలిపించారా అని నిలదీశారు. మధ్యప్రదేశ్‌లో కనీసంలో కనీసం 30వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు నిరూపిస్తారా? గుజరాత్ సంగతి సరేసరి అంటూ విమర్శలు గుప్పించారు.