Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ‘‘వెల్ కమ్’’ ఖాయం

  • టిడిపి టిఆర్ఎస్ పొత్తు ఖరారు
  • మరోసారి ధృవీకరించిన టిడిపి నేత
  • వేగంగా మారుతున్న సమీకరణాలు
Its official trs tdp alliance will happen

తెలుగు నేలమీద మరో సంచలనం.. బద్ధ శత్రువులు ఏకమవుతున్న తరుణం.. వైరి పార్టీలు చేతులు కలిపే సమయం. కత్తులు దూసుకున్న నేతలు ఏమవుతున్న క్షణాలను త్వరలోనే మనం చూడబోతున్నాం. అదే వెల్ కమ్ పొత్తులు ఖాయమైన వార్తలకు బలం చేకూరే సంఘటనలు మరిన్ని చోటు చేసుకుంటున్నయి.

తెలుగు రాష్ట్రాల్లో టిడిపి, టిఆర్ఎస్ రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయన్న పుకార్లు వచ్చాయి. కానీ అది వంద శాతం నిజమేనని తేలిపోయింది. తాజాగా టిడిపికి చెందిన ఒక సీనియర్ నాయకుడు దీన్ని మరోసారి ధృవీకరించారు. నిన్నమొన్నటి వరకు కొట్లాడుకున్న కత్తులు రేపు ఒక్కటి కానున్నాయి. తద్వారా కత్తుల కౌగిలిని తెలుగు నేలమీద మనం చూడబోతున్నామని తేలిపోయింది.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎపిలో టిడిపి, తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. తొలిరోజు నుంచి ఓటుకు నోటు కేసు వరకు టిడిపికి, టిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ మాటల స్థాయి ఎలా అంటే మరీ దిగజారిన మాటలు కూడా మాట్లాడుకున్నారు ఇరు పార్టీల నాయకులు. కానీ ఓటుకు నోటు కేసు సమయంలోనూ ఇరు పార్టీలు, ఇరు ప్రభుత్వాలు తీవ్రమైన ఘర్షణ పడ్డాయి. కలహించుకున్నాయి. 

కారణాలేంటో కానీ తర్వాత కొద్ది కాలానికే ఇరు పార్టీల మధ్య స్నేహం కుదిరింది. అప్పుడప్పుడు తమలపాకుతోటి, తిట్టుకుని, కొట్టుకున్నా లోపాయికారీ స్నేహం మాత్రం బాగానే సాగింది. ఇక ఆ స్నేహం ఇప్పుడిప్పుడే బహిర్గతమైతున్నది. తెలంగాణ సిఎం కేసిఆర్ అనంతపురం పర్యటన ఫలితంగా వెల్ కమ్ స్నేహం అనూహ్య మలుపులు తిరిగింది. వారి స్నేహం ఇప్పుడు తెర వెనుక నుంచి తెర మీదకు వచ్చింది. 

రానున్న ఎన్నికల్లో బిజెపితో, టిఆర్ఎస్ తో పొత్తులు ఉంటాయని మరోసారి టి టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ భవన్ సాక్షిగా ప్రకటించారు. కేసిఆర్ మా పార్టీ వాడే కదా? ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని గతంలో మోత్కుపల్లి ప్రకటించారు. ఈసారి కూడా కేసిఆర్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలుగా టిడిపి, టిఆర్ఎస్, బిజెపి కలిసి తెలంగాణ, ఎపిలో పనిచేస్తాయని స్పష్టం చేశారు మోత్కుపల్లి.


పొత్తులతో ఎవరికెంత లాభం..?
పొత్తులుంటాయి సరే? మరి పొత్తుల వల్ల 2019 లో ఎవరికి ఎంత లాభం అనేది కూడా రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఆ రెండు పార్టీల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. తెలంగాణలో చూస్తే టిడిపికి ఇప్పటికీ అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణలో బిసిల పార్టీగా టిడిపి బలమైన ముద్ర కలిగి ఉంది. అందుకే ఇంకా ఆ పార్టీని బిసిలు ఆదరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టిడిపిని అంటిపెట్టుకుని ఉన్న తెలంగాణ బిసి ఓటు బ్యాంకుతో పాటు కమ్మ సామాజిక వర్గం ఓట్లను కూడా గుండుగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలన్న ఉద్దేశంతోనే కేసిఆర్ అనూహ్యంగా పొత్తు ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారని అంటున్నారు. 

పొత్తులో భాగంగా టిడిపికి అన్నో ఇన్నో సీట్లు ఇచ్చేసి ఆ ఓటు బ్యాంకును తనకు వేయించుకోవాలన్నది కేసిఆర్ ప్లాన్. తద్వారా 2019లో కూడా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లురుతున్నది టిఆర్ఎస్ పార్టీ. దీనివల్ల కొన్ని సీట్లలో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ మెజార్టీ సీట్లు గెలవొచ్చని కేసిఆర్ వ్యూహంగా కనబడుతున్నది. ఎన్నికల తర్వాత టిడిపి గెలిచిన సీట్ల ఆధారంగా మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక టిడిపి విషయానికి వస్తే టిఆర్ఎస్ తో పొత్తు ఉన్నంత మాత్రాన టిడిపికి ఆంధ్రాలో కలిగే ఉపయోగం  ఏమాత్రం లేదు. నయాపైసా ఉపయోగం టిఆర్ఎస్ పొత్తు వల్ల టిడిపికి ఉండదు. మరి పొత్తు కోసం ఎందుకు టిడిపి ఆరాటపడుతుందన్నది కూడా ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణలో ఎపి టిడిపి నేతల ఆస్తులు భారీగా ఉన్నాయని, వాటి రక్షణ కోసం ఇక్కడ అనుకూలమైన ప్రభుత్వం ఉండాలి కాబట్టే పొత్తుకు టిడిపి సై అంటోందని ఒక వాదన కూడా వినిపిస్తోంది. 

దానికితోడు తెలంగాణలో పార్టీని నమ్ముకుని ఉన్న కొంతమంది నేతలు గెలవడానికి, ఒకరిద్దరు నేతలకు మంత్రి పదవులు దక్కడానికి కూడా పొత్తు కావాలన్న ఆరాటంలో టిడిపి ఉన్నట్లు చెబుతున్నారు. కేవలం తెలంగాణలో ఉన్న ఆస్తుల పరిరక్షణ కోసమే టిడిపి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే రేపటినాడు ఆంధ్రాలో అధికారం కోల్పోయే ప్రమాదం లేదా అన్నది కూడా ఇప్పుడు లక్ష డాలర్ల ప్రశ్నగా మిగిలింది. 


రేవంత్ అంచనాలు నిజమైనట్లేనా?
టిడిపి, టిఆర్ఎస్ పొత్తులు కుదిరితే ఒక్క క్షణం కూడా టిడిపిలో కొనసాగే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నమాట. తన శాయశక్తులా టిడిపి, టిఆర్ఎస్ పొత్తులు జరగకుండా అడ్డుకుంటానన్న ఉద్దేశంతో ఇంతకాలం రేవంత్ రెడ్డి ఉన్నారు. కానీ కేసిఆర్ వ్యూహాత్మక వైఖరి ముందు రేవంత్ నిలవలేకపోయారు. కేసిఆర్ ఒక్క అనంతపురం పర్యటన టిడిపిలో భారీ స్థాయిలో చిచ్చు పెట్టిందన్న విమర్శలున్నాయి. కేసిఆర్ వ్యూహాల ముందు టిడిపి నాయకత్వం తేలిపోయినట్లు కనబడుతున్నది. 

ఇక వెల్ కమ్ పొత్తను ఆపలేనని నిర్దారణకు వచ్చిన రేవంత్ తన దారి తాను చూసుకున్నారు. ఈ రెండు పక్షాలకు గట్ట షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను సైతం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. రేవంత్ అడుగులు టిఆర్ఎస్ కు పెద్దగా నష్టం కలిగించకపోవచ్చు కానీ టిడిపిలో తుపాన్ సృష్టించిందని చెప్పవచ్చు. రేవంత్ కాంగ్రెస్ నేత రాహుల్ తో భేటీ కావడం వెనువెంటనే యనమల సహా పయ్యావుల కేశవ్, పరిటాల కుటుంబంపై ఆరోపణలు గుప్పించారు. దీంతో టిడిపి అధినాయకత్వం ఆత్మరక్షణలో పడింది. రేవంత్ ను ఎలా డీల్ చేయాలా అని తలపట్టుకుంటున్నది. త్వరలోనే రేవంత్ ఎపిసోడ్ కు టిడిపి తెర దించే పరిస్థితే కనబడుతున్నది. 

ఏది ఏమైనా రకరకాల వ్యవహారాలు, వ్యాపారాల ప్రయోజనాల కోసమే తెలుగు రాష్ట్రాల్లో టిడిపి, టిఆర్ఎస్ పొత్తుల ప్రస్తానం సాగుతుందన్న విమర్శలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios