ఇండియాలో టాప్ సిటీగా.. ఎంట్రాప్రెన్యూయర్లకు అడ్డగా తమ నగరాన్ని డెవలప్ చేస్తామని ఇటు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, అటు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌లు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ పడదామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇటీవలే బెంగళూరులోని స్టార్టప్ ఫౌండర్లు మౌలిక సదుపాయాలపై అసంతృప్తితో చేసిన కామెంట్లకు కేటీఆర్ రియాక్ట్ అయి.. బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ వచ్చేయండని పిలుపు ఇచ్చారు.
హైదరాబాద్: సోమవారం ట్విట్టర్‌లో ఆసక్తికర పరిణామం ఎదురైంది. టెక్ ఎంట్రాప్రెన్యూయర్లకు టాప్ సిటీ హైదరాబాదా? బెంగళూరా అనే చర్చ జరిగింది. ఇది కామన్ మెన్ మధ్య జరిగిన చర్చ కాదు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్‌ల మధ్య ట్విట్టర్ ఎక్స్‌చేంజ్ జరిగింది. అంతేకాదు, పరస్పరం సవాళ్లు చేసుకుని అంగీకరించారు కూడా. ఆ చర్చ ఇలా సాగింది.
హౌజింగ్ డాట్ కామ్, ఖాతాబుక్ స్టార్టప్‌ల వ్యవస్థాపకుడు రవీశ్ నరేశ్ ఇటీవలే బెంగళూరులో మౌలిక సదుపాయాల గురించి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ప్రతి రోజూ విద్యుత్ కోతలు ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. మరో స్టార్టప్ చీఫ్ కూడా ఆయన వాదనలతో అంగీకరించారు. ఈ సంభాషణలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా జాయిన్ అయ్యారు. బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ వచ్చేయండి అని వారికి సూచించారు. ఇక్కడ మెరుగైన వసతులు ఉన్నాయని, తాము ముఖ్యంగా ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్‌పైన ఫోకస్ పెడుతున్నామని వివరించారు.
తాజాగా, ఈ ట్వీట్‌పై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రియాక్ట్ అయ్యారు. మై ఫ్రెండ్ కేటీఆర్.. మీ సవాలును స్వీకరిస్తున్నా అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. ఆ తర్వాత దేశంలో బెస్ట్ సిటీగా బెంగళూరు ఘనతను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ కూడా మళ్లీ జవాబు ఇచ్చారు. ప్రియమైన డీకే శివకుమార్ అన్నా.. కర్ణాటక రాజకీయాల గురించి తనకు పెద్దగా తెలియదని, ఎవరు గెలుస్తారో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. కానీ, సవాల్‌ను మాత్రం స్వీకరిస్తున్నట్టు వివరించారు. యువతకు ఉపాధిని కల్పించడంలో ఆరోగ్యకరమైన వాతావరణంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలు పోటీ పడనిద్దాం అని తెలిపారు. కాబట్టి, హలాల్, హిజాబ్‌లపై కాదు.. ఐటీ అండ్ బీటీ, మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెడదామని వివరించారు.
కర్ణాటక ఇటీవలి రోజుల్లో హిజాబ్ వివాదం, హలాల్ మాంసం అంశాలతో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.
సిలికన్ వ్యాలీగా పిలుస్తున్న బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, విద్యుత్ కోతలూ ఉన్నాయని డిజిటల్ బుక్ కీపింగ్ స్టార్టప్ ఖాతాబుక్ ఫౌండర్, సీఈవో రవీష్ నరేష్ మార్చి 30న ట్వీట్ చేశారు. దీనికి అనూహ్యంగా తెలంగాణ మంత్రి నుంచి స్పందన వచ్చింది.
ఖాతాబుక్ వ్యవస్థాపకుడు, సీఈవో తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నాడు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్, కోరమంగళ (దీన్నే భారత సిలికన్ వ్యాలీగా గుర్తిస్తుంటారు)లోని స్టార్టప్‌లు బిలియన్ డాలర్లను పన్నుల కింద ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయని, కానీ, ఈ ప్రాంతంలో రోడ్లు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయని, ప్రతి రోజు విద్యుత్ కోతలూ ఉన్నాయని వివరించారు. స్వచ్ఛమై మంచి నీరు లేదని, నడవడానికి వీలు లేని విధంగా ఫుట్ పాత్‌లు ఉన్నాయని ఆయన సమస్యలను ఏకరువు పెట్టారు. భారత్‌లోని చాలా గ్రామీణ ప్రాంతాలు ఇక్కడి సిలికన్ వ్యాలీ కంటే మెరుగ్గా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇక్కడి నుంచి సమీపంలోని విమానాశ్రయానికి వెళ్లాలంటే పీక్ ట్రాఫిక్ టైంలో మూడు గంటలు పడుతుందని తెలిపారు.
మరో స్టార్టప్ సేతు ఏపీఐ ఫౌండర్ నిఖిల్ కుమార్ కూడా రవీష్ నరేష్‌తో ఏకీభవించారు. ఆ ఆరోపణలు నిజం అంటూ పేర్కొన్నారు. బెంగళూరు ఎంత అధ్వాన్నంగా మారిపోయిందో అని ఆవేదన చెందారు. దయచేసి ఇక్కడి పరిస్థితులను గమనించి చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ట్విట్టర్ అకౌంట్‌ను ట్యాగ్ చేశారు. వెంటనే చర్యలకు ఉపక్రమించకపోతే ఇక్కడి నుంచి సామూహికంగా వలసలు తథ్యం అని పేర్కొన్నారు.
ఈ సంభాషణలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జాయిన్ అయ్యారు. అందుకే ‘మీ బ్యాగులు ప్యాక్ చేసుకోండి. హైదాబాద్‌కు తరలి రండి’ అని ట్వీట్ చేశారు. తమ దగ్గర మంచి మౌలిక సదుపాయాలు, అదే స్థాయిలో సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నదని పేర్కొన్నారు. తమ ఎయిర్ పోర్టు ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటి అని వివరించారు. సిటీలోకి వెళ్లడం, బయటకు రావడం కూడా ఎలాంటి ప్రయాస లేకుండా చాలా సులభంగా ఉంటుందని తెలిపారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తమ ప్రభుత్వం మూడు ఐ మంత్రాలను పాటిస్తుందని వివరించారు. ఒకటి ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్ అని పేర్కొన్నారు.
