కరోనా మహమ్మారి దేశంలో తీవ్ర రూపం దాలుస్తోంది. ఊహించిన రీతిలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇదంతా నాణేనికి ఓ వైపు అయితే.. ఈ వైరస్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి.. కనీసం తినడానికి తిండి లేక.. ఆర్థిక సమస్యలతో అతలాకుతలమౌతున్నవారు చాలా మందే ఉన్నారు. తాజాగా.. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. తండ్రికి విషమిచ్చి.. అనంతరం తాను కూడా అదే విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బంజారాహిల్స్‌ హిల్స్‌ కాలనీలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో నివసించే అల్లంపాటి రామిరెడ్డి (61), ఎ.శ్రావణి రెడ్డిలు భార్యాభర్తలు. వీరికి ఎ.అనీష్‌ రెడ్డి (33) కొడుకు ఉన్నాడు. అనీష్‌ రెడ్డి ఐటీ సంస్థల్లో క్యాంటీన్లు నిర్వహిస్తుంటాడు.  ఆరు నెలలుగా కరోనా వల్ల ఐటీ సంస్థలన్నీ వర్క్‌ఫర్‌ హోం పెట్టాయి. దీంతో ఇతని క్యాంటీన్‌ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. 

తీవ్ర మనస్థాపానికి గురైన అనీష్‌ రెడ్డి గత కొంత కాలంగా తీవ్రంగా మానసిక క్షోభలో ఉన్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును చనిపోతే  ఈ ఏజ్‌లో తల్లిదండ్రులు ఎలా బతుకుతారు అనుకున్నడో ఏమో అనీష్‌ రెడ్డి బుధవారం రాత్రి 11:10 ప్రాంతంలో గుర్తుతెలియని మందు ఇంటికి తీసుకువచ్చాడు. ఇది కరోనా రాకుండా ఉండే మందు అని నమ్మబలికాడు. మొదట తండ్రి రామిరెడ్డికి తాగించాడు.

తల్లిని కూడా తాగమనగా తాను వంటచేస్తున్నాను తర్వాత తాగుతాను అని చెప్పడంతో అనీష్‌ రెడ్డి కూడా తాగాడు. పది నిమిషాల తర్వాత తల్లి వంటగది నుండి బయటకు రాగా ఇద్దరూ వాంతులు చేసుకుంటున్నారు. దీంతో కంగారు పడ్డ శ్రావణి రెడ్డి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఇద్దర్నీ సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనీష్‌ రెడ్డి మృతి చెందగా, రామిరెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ప్రస్తుతం క్రిటికల్‌ కేర్‌లో చికిత్స పొందుతున్నాడు.