దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేశారు. ఈ దాడిలో తెలంగాణ వాళ్లే ఎక్కువగా పాల్గొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ఎస్పీ అనూరాధ తెలిపారు.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసం కేసును సిట్‌కు బదిలీ చేశారు. ఈ దాడిలో పాల్గొన్నవారిలో అత్యధిక శాతం మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ఎస్పీ అనూరాధ తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని సిట్ నేతృత్వంలో విచారణ జరగనుంది.
అంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (secunderabad railway station) చోటు చేసుకున్న విధ్వంసంపై రైల్వే ఎస్పీ అనురాధ (railway sp anuradha) స్పందించారు. ఆదివారం మీడియా ముందుకు వచ్చిన ఆమె మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన 46 మందిని ఆధారాలతో సహా అరెస్ట్ చేశామన్నారు. రెండు వేల మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారని ఆమె చెప్పారు. కోచింగ్ సెంటర్లు ఆర్మీ ఉద్యోగార్థుల్ని రెచ్చగొట్టాయని.. సదరు కోచింగ్ సెంటర్లను గుర్తించామని అనురాధ తెలిపారు.
వీరందరికీ రైల్వే యాక్ట్ సెక్షన్ 150 కింద యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం వుందని ఆమె వెల్లడించారు. అలాగే యువకులను రెచ్చగొట్టిన వాట్సాప్ గ్రూప్‌లను కూడా గుర్తించామని అనురాధ తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని ఎలా దాడి చేయాలో చర్చించుకున్నారని ఆమె పేర్కొన్నారు. పోలీసులు, ప్రయాణీకులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని అనురాధ తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్లంతా తెలంగాణ వాళ్లేనని... ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
ఈస్ట్ కోస్ట్, దనాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వాళ్లు వచ్చారని అనూరాధ తెలిపారు. ఆందోళనకారులను అదుపు చేసుందేరకు ఆర్పీఎఫ్ వాళ్లు కాల్పులు జరిపారని ఆమె చెప్పారు. 17న ఉదయం 8 గంటలకు 300 మంది స్టేషన్‌లోకి చొరబడ్డారని అనూరాధ తెలిపారు. రూ.12 కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం వుందన్నారు. ఘటనలో 9 మంది రైల్వే సిబ్బంది గాయపడ్డారని.. నిందితుల్ని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఒక కోచ్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టారని.. పదుల సంఖ్యలో కోచ్‌లు ధ్వంసమయ్యాయని అనూరాధ పేర్కొన్నారు.
