రోజులాగే కళాశాలకు వెళ్లిన ఓ యువకుడు ఎవ్వరూ లేని సమయంలో తరగతి గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

మహబూబ్ నగర్: తరగతి గదిలోనే ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవలే కన్నతల్లి చనిపోవడంతో తట్టుకోలేకపోయిన యువకడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు బాలరాజు ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే 15రోజుల క్రితం అనారోగ్యంతో అతడి తల్లి మరణించింది. దీంతో బాలరాజు తల్లి పోయిన బాధనుండి తేరుకోలేకపోతున్నాడు.

ఈ క్రమంలోనే తల్లి లేకుండా బ్రతకలేక దారుణ నిర్ణయం తీసుకున్నాడు. రోజులాగే కళాశాలకు వెళ్లిన అతడు ఎవ్వరూ లేని సమయంలో తరగతి గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు తెలియజేశారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలోపడ్డారు.