ఉరి వేసుకుని  యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై యాదగిరి కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం నాగరపల్లి గ్రామానికి చెందిన అశోక్, రమాదేవి దంపతులు మియాపూర్ టీఎన్ నగర్ లో నివాసం ఉంటున్నారు.

అశోక్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సిందే  సుదీప్‌కుమార్‌ (18) ఉన్నారు.  సుదీప్‌ స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.  కరోనా నేపథ్యంలో కాలేజీ కి సెలవులు ఉండడంతో కొన్ని రోజులుగా స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతున్నాడు.

తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద డబ్బులు తీసుకుని జల్సాలు చేస్తూ రోజు అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడు. దీంతో తల్లిదండ్రులు మందలించే వారు.  ఇదిలా ఉండగా సుదీప్ బుధవారం రాత్రి హైటెక్ సిటీ హోటల్ కు వెళ్దామని తన స్నేహితులను పట్టుబట్టగా, ఈ సమయంలో వద్దని వారించడంతో వారితో గొడవ పడ్డాడు. 

రాత్రి ఒంటిగంటకు స్నేహితులు అతడిని ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది సేపు స్నేహితులతో ఫోన్ లో చాట్ చేసిన సుదీప్.. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అని మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య. చేసుకున్నాడు.

తెల్లవారుజామున 3 గంటలకు తల్లి లేచి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబసభ్యులు, పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.