Asianet News TeluguAsianet News Telugu

‘సూది మందు’ అనుమానం.. భయంతో ఆటోలోంచి దూకిన ఇంటర్ విద్యార్థి..

ఖమ్మం జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. సూది మందు అనుమానంతో ఓ విద్యార్థి రన్నింగ్ ఆటోలోనుంచి దూకేశాడు. దీంతో అతడికి గాయాలయ్యాయి. 

inter student jumps from auto in khammam
Author
First Published Sep 23, 2022, 9:33 AM IST

ఖమ్మం జిల్లా : నెల్లూరులో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తకు విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపించిన ఘటన మరువక ముందే.. అంతకుముందు ఖమ్మంలో జరిగిన మరో సూది హత్య వెలుగులోకి రావడంతో రెండు రాష్ట్రాల్లో సూది హత్యల అంశం కలకలం రేపుతోంది. దీంతో సూది, ఇంజక్షన్ లాంటి పదాలతో ఏ సంభాషణ వినపడ్డా, కాస్త అనుమానాస్పదంగా అనిపించినా ప్రజలు భయాందోళనకలు గురవుతున్నారు. దీనికి తోడు మత్తు ఇంజక్షన్ ఇచ్చే సైకో తిరుగుతున్నాడన్న పుకార్లు వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. 

ఆటోలో సూదిమందు చర్చ జరుగుతుండగా భయపడిన యువకుడు అందులోంచి దూకి గాయాలపాలైన ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం అజయ్ తండాకు చెందిన బానోత్ గోపి నేలకొండపల్లిలో ఇంటర్ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకు అజయ్ తండాలో చెరువుమాదారం నుంచి వస్తున్న ఓ ఆటో ఎక్కాడు. ఆటోలో ఓ వ్యక్తి, వృద్ధుడు, బాలుడు ఉన్నారు. బాలుడు వెనక సీట్లో పడుకుని ఉన్నాడు. డ్రైవర్ కు ఆటోలో ఉన్న వ్యక్తికి మధ్య సూది ఘటనపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వారిని చూసి భయపడిన గోపి ఆటో ఆపాలని అభ్యర్థించాడు. 

వివాహేతర సంబంధంతోనే ఇంజక్షన్ గుచ్చి మర్డర్.. ముగ్గురు నిందితుల గుర్తింపు, ఇద్దరు అరెస్ట్..

వారు ఆపకుండా అలాగే వెళ్లడంతో.. వెనక ఉన్న సూదివేసి పడుకోబెట్టి ఉండొచ్చు నాకు కూడా సూది వేస్తారు ఏమో అని అనుమానపడ్డాడు. అదే సమయంలో వృద్ధుడు సంచిలో చేయిపెట్టాడు. వారు ఖచ్చితంగా తనకు సూది మందు వేస్తారు అని భయపడి ఆటో నుంచి కిందికి దూకేశాడు. దీంతో ఆటో కూడా పల్టీ కొట్టింది. గోపికి గాయాలయ్యాయి. అక్కడి నుంచి పారిపోయి అజయ్ తండా చేరుకున్నాడు. ప్రస్తుతం గోపి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు.

కాగా, ఇద్దరు భార్యలున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ చిన్న భార్యకు మత్తుమందు ఇచ్చి చంపేశాడు. ఆమె బిడ్డను ప్రసవించిన మరుసటి రోజే, ఆస్పత్రిలోనే ఇంజక్షన్ చేశాడు. ఆపై వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని లబోదిబోమన్నాడు. ఖమ్మం జిల్లాలో 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం నగరంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా,  అనస్థీషియా వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు.   

అతనికి మొదట తన మేనకోడలితో వివాహం అయ్యింది. అయితే వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో తనకంటే ఇరవై ఏళ్ల చిన్నది అయిన నవీన (23)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు ముగ్గురూ అన్యోన్యంగానే ఉన్నారు. నవీనకి పాప పుట్టింది. తర్వాత సవతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నవీన రెండోసారి గర్భం దాల్చింది. గొడవలతో విసిగిపోయిన భిక్షం భార్య నవీనను హతమార్చాలని పథకం వేశాడు. ప్రసవంకోసం జూలై 30న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆడ శిశువు పుట్టింది. మరుసటి రోజు తెల్లవారేసరికి నవీన ఆస్పత్రిలోనే చనిపోయింది. 

సరిగ్గా వైద్యం చేయకపోవడం వల్లే తన భార్య చనిపోయిందంటూ తన బంధువులతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు భిక్షం. నవీన హఠాత్తుగా ఎందుకు చనిపోయింది అర్థం కాని వైద్యులు,  ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. బిక్షం కూతుర్లు ఇద్దరికీ ఆర్థిక సాయం చేస్తామని సదరు ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది. ఆందోళన విరమించిన భిక్షం నవీన మృతదేహాన్ని ఊరికి తీసుకు వెళ్ళకుండా ఖమ్మంలోనే స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశాడు. నవీన అంత్యక్రియలను ఖమ్మంలో నిర్వహించడంతో ఆసుపత్రి సిబ్బందిలో అనుమానం మొదలైంది.

హాస్పిటల్ లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రసవం జరిగిన రోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బిక్షం తన భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం, ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వెళ్లి హడావిడి చేయడం కనిపించాయి. నిర్ఘాంతపోయిన ఆస్పత్రి యాజమాన్యం ఖమ్మం టూ టౌన్ పోలీస్ లను సంప్రదించింది. స్వాతంత్ర వజ్రోత్సవాలు, వినాయక చవితి నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఇటీవల భిక్షంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా… అసలు విషయం బయటపడింది. నవీనకు ఇంజక్షన్ ద్వారా అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి చంపినట్లు ఒప్పుకున్నాడు. రెండు వారాల క్రితమే పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జమాల్ సాహెబ్ ఘటనతో  ఇది కూడా వెలుగులోకి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios