వెంకయ్యనాయుడు పర్యటన తనిఖీల్లో.. స్టేజీమీదినుంచి పడి ఇంటెలిజెన్స్ ఏడీ దుర్మరణం..
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన కోసం వేదికను పరిశీలిస్తున్న ఓ ఇంటెలిజెన్స్ ఏడీ దుర్మరణం పాలయ్యాడు. స్టేజ్ మీదినుంచి పడి కోమాలోకి వెళ్లి.. చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచాడు.
హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి Venkaiah Naidu పర్యటన కోసం ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు స్టేజీమీదినుంచి జారిపడి Additional Director of the Intelligence Bureau మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.
స్థానిక సీఐ రవీంద్ర ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ లోని పాట్నాకు చెందిన కుమార్ అమ్రేష్ (51) కోఠిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని ఐబీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. ఈనెల 20న దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పుస్తక ఆవిష్కరణ మాదాపూర్లోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా తనిఖీల్లో భాగంగా బుధవారం ఐబీ అధికారులు శిల్పకళా వేదికకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తున్న కుమార్ అమహేష్ స్టేజిపై నుంచి పన్నెండు అడుగుల లోతులో ఉన్న మెయింటెనెన్స్ డెక్ పై పడ్డారు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన అతడిని సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.
కోమాలోకి వెళ్లిన ఆయన పరిస్థితి విషమించడంతో సాయంత్రం ఏడు గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బదిలీపై నాలుగు సంవత్సరాల కిందట హైదరాబాద్కు వచ్చిన కుమార్ అమరేష్ కొద్ది నెలల క్రితమే డిప్యూటీ డైరెక్టర్ నుంచి అడిషనల్ డైరెక్టర్ గా పదోన్నతి పొందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ జనవరిలో కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ లోనే సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. అంతేకాదు తనతో కాంటాక్టులోకి వచ్చిన వారంతా వెంటనే ఐసొలేషన్‌లోకి వెళ్లాలని పేర్కొన్నారు. ఆ తర్వాత కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. ఉపరాష్ట్రపతి సెక్రెటేరియట్ ట్విట్టర్ ఖాతా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉణ్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకిందని పేర్కొంది. ఆయన వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఆయనతో కాంటాక్టులోకి వచ్చిన వారందరినీ ఐసొలేషన్‌లోకి వెళ్లాలని కోరారు. ఆ తర్వాత కరోనా టెస్టు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.