అమ్మాయిలు ఇంట్లోనుంచి కాలు బయట పెడితే చాలు కామాంధులు చెలరేగి పోతున్నారు. ఏదో ఒక రూపంలో వారిని వంచించాలని.. లైంగికంగా వాడుకోవాలని చూసే నీచబుద్ధులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 

తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. బంజారాహిల్స్ లో ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువతిని ఓయో రూం కు రావాలంటూ వేధించిన ఘటన బయటపడింది.

ఉద్యోగం కావాలంటే ఓయో రూమ్‌కు రావాలంటూ యువతితో ఓ ఉద్యోగి అసభ్యంగా చాటింగ్‌ చేశాడు. సదరు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన 28 యేళ్ల యువతి వారం క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని ఓ ఇమ్మిగ్రేషన్ సంస్థలో ఉద్యోగానికి ఇంటర్వ్యూకు హాజరయ్యింది. 

ఇక్కడ మేనేజర్ గా పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి సుమంత్ మూడ్రోజుల క్రితం నుంచి ఆమెతో ఛాటింగ్ చేస్తున్నాడు. ఉద్యోగం కావాలంటే తాను ఓయో రూమ్‌ బుక్‌ చేశానని.. అక్కడికివస్తే ఇప్పిస్తానంటూ చెప్పాడు.  దీంతో ఆందోళన చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇమ్మిగ్రేషన్  సెంటర్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ సుమంత్ మీద కేసు నమోదు చేశారు. ఐపీసీ 509 సెక్షన్‌ కింద బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.