Heavy Rainfall: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్
Hyderabad: మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Red alert issued for Hyderabad: దేశంలోని చాలా ప్రాంతాల్లో వానలు దించికొడుతున్నాయి. తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవే పరిస్థితులు మరికొన్నిరోజులు ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం (జూలై 25న) తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సిద్దిపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. .
తెలంగాణలో ఈ నెల 27 వరకు వర్షాలు..
ఈ నెల 26న తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మధ్య తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 27న తెలంగాణ రాజధాని ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ కు రెడ్ అలర్ట్..
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కాగా, గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ లో అత్యధికంగా 464 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లోని చార్మినార్ లో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్ డీపీఎస్ ) తెలిపింది. వర్ష సూచనల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, అందుకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.