IMD heatwave  Alert: రాగల నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లో వడగాల్పులు వీచే అవకాశముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రించింది. జూన్ 9 వరకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 41-44 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటుందని పేర్కొంది. నగరంలో పాటు ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.

Heatwave Alert To Telangana: రాగల నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ ప్రకారం, గరిష్ట ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే కనీసం 4.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నప్పుడు వడగాల్పులు ప్రకటిస్తారు. 6.4 డిగ్రీల సెల్సియస్ దాటితే దాన్ని తీవ్రమైన వడగాల్పుగా పరిగణిస్తారు. జూన్ 9 వరకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 41-44 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటుందని పేర్కొంది. ఈ క్ర‌మంలోనే వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. 

తెలంగాణలో వడగాల్పులు ఎదుర్కొంటున్న ఏకైక జిల్లా హైదరాబాద్ మాత్రమే కాదనీ, న‌గ‌రంలో పాటు చాలా జిల్లాల్లో ఇలాంటి ప‌రిస్థితులు ఉంటాయ‌ని తెలిపింది. "రాగల నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. పెరుగుతున్న ఎండ‌ల తీవ్ర‌త స్థాయిలు ఈ ప్రాంతాల నివాసితులలో అవగాహన-సంసిద్ధతను పెంచాల్సిన అవసరం ఉందని" హైద‌రాబాద్ ప్రాంతీయ వాతావ‌ర‌ణ కేంద్రం త‌న బులిటెన్ లో పేర్కొంది. రాబోయే రోజుల్లో తీవ్రమైన వడగాల్పులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ సిద్ధమవుతున్నందున, ముఖ్యంగా బయట తిరగేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమ‌ని తెలిపింది. 

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన జాతీయ బులెటిన్ లో హెచ్చరించింది. తెలంగాణతో పాటు జార్ఖండ్, బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు బిహార్ నుంచి ఛత్తీస్ గ‌ఢ్ మీదుగా తెలంగాణ వైపు ద్రోణి ప్రవహిస్తుండటంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు జూన్ 6న వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 7న సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జూన్ 8, 9న ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వేడిగాలులు వీస్తాయ‌ని తెలిపింది.