తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్ ఆ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. ప్రతిపక్షంలోని సంజయ్ రౌత్.. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలోనూ అధికారాన్ని కోల్పోతారని పేర్కొన్నారు.
ముంబయి: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను హైలైట్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నేత, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తన డ్రామాలు కట్టిపెట్టాలని అన్నారు.
కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే.. తెలంగాణలోనూ అధికారం పోతుందని చురకలంటించారు. తెలంగాణ పరిస్థితులు చూస్తే.. అక్కడ ఓడిపోతామనే భయం కేసీఆర్‌కు పట్టుకుందని, అందుకే ఆయన మహారాష్ట్రలో పర్యటిస్తున్నాడనీ ఆరోపించారు. బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి సహా పలువురు నేతలు కాంగ్రెస్ గూటిలోకి వెళ్లుతుండటాన్నీ సంజయ్ రౌత్ గుర్తు చేశారు.
Also Read: న్యూయార్క్‌లో దీపావళికి స్కూల్ హాలీడే.. ప్రకటించిన మేయర్
బీఆర్ఎస్ నుంచి 12 నుంచి 13 మంది నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోరు స్పష్టంగా కనిపిస్తున్నదని వివరించారు. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి బలంగా ఉన్నదని తెలిపారు. ఈ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతున్న కేసీఆర్ పార్టీని విస్తరిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ పనులు ప్రారంభం అవుతాయని తెలుస్తున్నది. ఇందులో భాగంగా కేసీఆర్ మహారాష్ట్రలో అడుగుపెట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఫామ్‌లోకి వచ్చిన తెలంగాణలోనూ అధికారాన్ని సాధించడానికి పకడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నది.
