తెలంగాణ : వరద బాధితులకు ఐఏఎఫ్ ఆపన్న హస్తం .. 600 కిలోల ఆహార ప్యాకెట్లను జారవిడిచిన హెలికాఫ్టర్లు
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలను అందించడంలో అలుపెరగని సేవలు చేస్తోంది భారత వైమానిక దళం. ఐఏఎఫ్‌కు చెందిన హెలికాప్టర్లు శుక్రవారం సుమారు 600 కిలోల ఆహార ప్యాకెట్లను వరద ప్రభావిత ప్రాంతాల్లో జారవిడుస్తున్నాయి.

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వాగులు, వంకలు పోటెత్తడంతో గ్రామాలు, కాలనీల్లోకి నీరు చేరుతోంది. ఇప్పటికే వందలాది గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుని బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో వీరంతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, రెవెన్యూ తదితర విభాగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
కాగా.. తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలను అందించడంలో అలుపెరగని సేవలు చేస్తోంది భారత వైమానిక దళం. ఐఏఎఫ్‌కు చెందిన హెలికాప్టర్లు శుక్రవారం సుమారు 600 కిలోల ఆహార ప్యాకెట్లను వరద ప్రభావిత ప్రాంతాల్లో జారవిడుస్తున్నాయి. 'సాంగినీస్'గా గుర్తింపు తెచ్చుకున్న ‘‘ ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్’’ సభ్యులు అందించిన రిలీఫ్ మెటీరియల్ , ఆహార పదార్థాలు ఈ ప్యాకెట్లలో ఉన్నాయి.
Also Read: భద్రాచలం వద్ద గోదారి ఉగ్రరూపం.. 53 అడుగులకు చేరిన నీటిమట్టం, మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
భారత గగనతలాన్ని సంరక్షిస్తూనే మానవతా సహాయం , ప్రకృతి విపత్తు ఉపశమనం (HADR) అందించడంలోనూ ఎయిర్‌ఫోర్స్ ఎల్లప్పుడూ ముందంజలో వుంటుంది. IAF పైలట్‌లకు అత్యాధునిక హెలికాప్టర్‌లను నడిపే శిక్షణను అందించే హైదరాబాద్‌లోని హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుండి హెలికాప్టర్లు విపత్తుల సమయంలో సేవలు అందించడానికి సిద్ధంగా వుంటాయి. ఈ క్రమంలోనే జూలై 27న తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద ముంపునకు గురైన నైన్‌పాక గ్రామంలో జేసీబీపై చిక్కుకుపోయిన ఆరుగురిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సహాయక చర్యల్లో ఐఏఎఫ్ సిబ్బంది నిమగ్నమై వుంటారు.