మహాబూబ్‌నగర్: తన భర్తను చిత్రహింసలు పెట్టి చంపిన పోలీసులను తాను వదలనని చటాన్‌పల్లి ఎన్ కౌంటర్ లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుక స్పష్టం చేశారు. ఎన్నేళ్లైనా తన భర్త తిరిగి వస్తాడనుకొన్నా కానీ, చివరకు అతను లేకుండా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: బుల్లెట్ గాయాలివే, పోస్టుమార్టం రిపోర్ట్ ఇదీ...

ఆదివారం సాయంత్రం ఆమె ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ముఖం చూసైనా తన భర్తను వదిలేస్తారనుకొన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత కాలం తర్వాతనైనా తన భర్త తిరిగి వస్తాడనుకొన్నానని ఆమె చెప్పింది. తన భర్త కేసు విషయంలో కోర్టు తీర్పు చెప్పకముందే ఆయన్ను చంపేయడం తప్పని ఆమె అభిప్రాయపడ్డారు. 

తన భర్త ముఖంపై వేడి నీళ్లు పోసి కొట్టారని తెలిసిందని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తన భర్తను వేధించి, చిత్ర హింసలు పెట్టి చంపిన పోలీసులను తాను వదలబోనని ఆమె చెప్పారు. 

తాను ఎవరిని చూసుకొని బతకాలని ఆమె పోలీసులను ప్రశ్నించారు. తనకు దిక్కెవరని ఆమె రోధిస్తోంది.ఒక్కసారైనా తనతో మాట్లాడించాలని తాను కోరినా కూడ వినలేదన్నారు. కనీసం ఫోన్‌లో కూడ మాట్లాడించలేదని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకొన్నారు. చివరి చూపుకు కూడ నోచుకోలేకపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

తనపైనే కుటుంబ బారం పడిందన్నారు. తనకు పుట్టబోయే బిడ్డకు ఏం చెప్పాలని ఆమె నిలదీశారు. తొమ్మిది నెలల పిల్లను రేప్ చేసిన వారికి ఇప్పటివరకు ఎలాంటి శిక్ష వేయని విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ తన భర్తనే ఎందుకు చంపారని ఆమె పోలీసులను ప్రశ్నించారు.

అత్యాచారాలు చేసిన వారెంతమంది జైల్లో ఉన్నారని చెన్నకేశవులు తల్లి ప్రశ్నించారు. దిశ అత్యాచారం చేసిన నిందితులైన మా నలుగురు పిల్లలకే జైళ్లు లేవా, అక్కడ తిండి లేదా అని ఆమె ప్రశ్నించారు. పోలీసులు లంచాలు తీని తన కొడుకును కాల్చి చంపారని ఆమె ఆరోపించారు.