Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కు మద్దతు: టీఆర్ఎస్‌లో చేరికపై తేల్చేసిన సుమన్

రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశ్యంతోనే తాను రాష్ట్ర విభజనను  స్వాగతించినట్టు సినీ నటుడు సుమన్ చెప్పారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సీఎం కేసీఆర్ నెరవేర్చాడని ఆయన అభిప్రాయపడ్డారు

I'm not interest to leaving cinema industry says actor suman


హైదరాబాద్: రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశ్యంతోనే తాను రాష్ట్ర విభజనను  స్వాగతించినట్టు సినీ నటుడు సుమన్ చెప్పారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సీఎం కేసీఆర్ నెరవేర్చాడని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తాను కేసీఆర్‌కు మద్దతిచ్చినట్టు చెప్పారు.

ఏషియానెట్ తెలుగు న్యూస్‌కు  సినీ నటుడు సుమన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ అంశాన్ని అనేక మంది నేతలు, పార్టీలు  ఉపయోగించుకొన్నప్పటికీ... ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్  సక్సెస్ అయ్యారని  సుమన్ గుర్తు చేశారు.

పార్టీని ఏర్పాటు చేసి  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం  చివరి వరకు ఆయన చేసిన పోరాటం అభినందించదగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోతే  రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతోందని భావించానని ఆయన చెప్పారు.

 

అందుకే తెలంగాణ ఉద్యమం సాగుతున్న కాలంలో తాను  రాష్ట్ర విభజనను స్వాగతించినట్టు చెప్పారు.  తెలంగాణ, ఏపీ,, రాయలసీమ ప్రాంతాలకు చెందినవారు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో హైద్రాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేవారన్నారు.  దీని వల్ల  హైద్రాబాద్ కేంద్రంగా అభివృద్ధి సాగిందన్నారు.

తెలంగాణలో ఉద్యోగాలు, వెనుకబాటుతనంపై చాలా కాలంగా ప్రజల్లో  ఆవేదన ఉందన్నారు. రాష్ట్రం విడిపోతే అభివృద్ధి చెందుతోందనే భావన తెలంగాణ వాసుల్లో ఉన్న విషయాన్ని తాను గుర్తించినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలు కూడ రాష్ట్రం విడిపోతే అభివృద్ధి చెందే అవకాశం ఉందని తాను  విభజన ఉద్యమం సమయంలో భావించినట్టు చెప్పారు.

ప్రస్తుతం ఏపీలో కూడ అభివృద్ధి సాగుతోందన్నారు. కొత్తగా ఎయిర్‌పోర్టులు, పోర్టులు, పరిశ్రమలు ఏర్పాటౌతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అనంతపురంలో  కియా కార్ల పరిశ్రమ పూర్తిస్థాయిలో పనులను ప్రారంభిస్తే  సీమలో  ఉపాధి అవకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న ఐదు లేదా పదేళ్లలో ఈ అభివృద్ధి అందరికీ కన్పించే అవకాశం ఉందని చెప్పారు.

అయితే తాను వన్‌సైడ్‌గా మాట్లాడడం లేదన్నారు.  తనకు అందరూ కావాలన్నారు. రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందునే తాను విభజనను స్వాగతించినట్టు ఆయన కుండబద్దలుకొట్టారు.

తనకు సినిమాల వల్లే పేరు వచ్చిందన్నారు. సినిమాలను వదిలి ఇంకా బయటకు రావాలనుకోవడం లేదన్నారు. ఏదైనా మంచి కారణం కోసం పనిచేసే పార్టీలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. 

క్యాస్టింగ్ కోచ్, శ్రీరెడ్డి విషయాలపై సుమన్ అభిప్రాయం రేపటి వీడియోలో చూడండి.

Follow Us:
Download App:
  • android
  • ios