ఆ బాధ నాకు తెలుసు: దత్తాత్రేయకు రోహిత్ వేముల తల్లి సానుభూతి

ఆ బాధ నాకు తెలుసు: దత్తాత్రేయకు రోహిత్ వేముల తల్లి సానుభూతి

హైదరాబాద్: కుమారుడు వైష్ణవ్ ను కోల్పోయిన బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి సానుభూతి తెలియజేశారు. కుమారుడిని కోల్పోయిన బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో తనకు తెలుసునని ఆమె అన్నారు. 

గుండెపోటుతో దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మరణించిన విషయం తెలిసిందే. "హృదయం లోతుల్లోంచి దత్తాత్రేయకు, ఆయన కుటుంబానికి నేను తీవ్రమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎవరైనా తన కుమారుడిని కోల్పోయినప్పుడు ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు తెలుసు. మీరు బాగుంటారని ఆశిస్తున్నాను. మీకు జరిగిన నష్టానికి విచారం. జై భీమ్" అంటూ ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు.  

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పిహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల 2016 జనవరి 17వ తేదీన ఉరేసుకుని తన గదిలో మరణించాడు. విశ్వవిద్యాలయం వేధింపులకు గురి చేయడం వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడనే విమర్శలు వచ్చాయి.

దత్తాత్రేయ ప్రోద్బలంతోనే విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులపై తీవ్రమైన వివక్ష ప్రదర్శించారనే ఆరోపణలు వచ్చాయి. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న దళిత విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆయన విద్యా శాఖ మంత్రికి లేఖ రాసినట్లు కూడా వార్తలు వచ్చాయి. 

రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ దత్తాత్రేయపై కేసు కూడా పెట్టారు. అయితే, దత్తాత్రేయకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎకె రూపన్వాలా క్లీన్ చిట్ ఇచ్చారు. 

దత్తాత్రేయ కుమారుడు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మంగళవారం రాత్రి మరణించాడు. అతను ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతన్ని బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page