నేను బిజెపికి రాజీనామా చేయడం లేదు..వివేక్ వెంకటస్వామి
పార్టీ మారతారన్న ఊహాగానాలకు చెక్ పెట్టారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. తాను బీజేపీకి రాజీనామా చేయడంలేదని తెలిపారు.
హైదరాబాద్ : ‘నేను బిజెపికి రాజీనామా చేయడం లేదు’..అంటూ బీజీపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ‘అలాయ్ బలాయ్’ కార్యక్రమానికి వివేక్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఇలా చెప్పుకొచ్చారు.
‘నేను పార్టీ మారతానని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బిజెపి అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేస్తా. నేను బిజెపికి రాజీనామా చేయడం లేదు. ఇప్పుడే దత్తాత్రేయ గారి ఆలయబలై ప్రోగ్రాంలో పాల్గొన్నాను’ అని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని విలేకరులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం గురించి ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా.. ‘నెల రోజుల నుంచి నేను పార్టీ మారుతున్నానని ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం నాకు తెలియదు’ అని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ విషయం తనకు తెలియదంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.