నిజామాబాద్: తాను హిందువులకు వ్యతిరేకం కాదని మజ్లీస్ (ఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్ సీఆర్ లకు వ్యతిరేకంగా ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ జరిగింది. 

ఆ సభకు ఓవైసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్ఆర్సీ, సిఐఏ, ఎన్సీఆర్ లు రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన అన్నారు. అన్ని మతాల సమ్మేళనం భారతదేశమని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ముక్కలు చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. 

తన పౌరసత్వాన్ని అడిగే హక్కు ప్రధాని మోడీకి లేదని ఆయన అన్నారు. తెలంగాణను సెక్యులర్ గా ఉంచుతామని ఆయన చెప్పారు. కేసీఆర్ మీద ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ ను మించిన లౌకికవాది మరొకరు లేరని అన్నారు. టీఆర్ఎస్ లౌకిక విధానాన్ని వదిలిపెట్టదని చెప్పారు. తాను బతికినంత కాలం కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పారు. 

పౌరసత్వ చట్టం కేవలం ముస్లింలకు మాత్రమే వ్యతిరేకం కాదని, అన్ని వర్గాలకు కూడా నష్టమని ఆయన అన్నారు. ఒకే మతానికి చెందినప్పటికీ మోడీకి, కేసీఆర్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. 

మోడీ మతాన్ని అందరిపై రుద్దాలని చూస్తారని, కేసీఆర్ అన్ని మతాలనూ గౌరవిస్తారని ఆయన చెప్పారు. కేరళలో మాదిరిగా రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని అమలు చేయవద్దని ఆయన కేసీఆర్ ను కోరారు. ఆ విజ్ఞప్తి చేస్తే అంతకన్నా ఎక్కువే చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.