హ్యుందాయ్ ₹8,528 కోట్లతో జహీరాబాద్‌లో టెస్ట్ సెంటర్ నెలకొల్పుతుంది. ఇది 4,200 ఉద్యోగాలను కల్పించే అవకాశం కలిగిస్తుంది.
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండటంతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి
. తాజాగా దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ మోటార్ భారత్‌లోని తన విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) ద్వారా రాష్ట్రంలో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది.
ఈ సంస్థ మెగా టెస్ట్ సెంటర్‌ను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. ఇది మొత్తం 675 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనుండగా, దాదాపు ₹8,528 కోట్ల భారీ పెట్టుబడి ఈ ప్రాజెక్ట్‌లో జరుగనుంది.
తయారీ విభాగానికీ…
ఇక్కడ కార్లను తయారు చేసే యూనిట్‌తో పాటు, అన్ని రకాల వాహనాలను పరీక్షించే ప్రత్యేక ట్రాక్‌లు ఉండనున్నాయి. డిజిటల్ ప్రోటోటైప్ సిస్టమ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ కూడా ఇందులో భాగమవుతాయి. మొదట కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ మాత్రమే ఏర్పాటు చేయాలన్న హ్యుందాయ్ ఆలోచన, ఇప్పుడు తయారీ విభాగానికీ విస్తరించడం గమనార్హం.
ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు…
ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 4,200 మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీ ప్రతినిధులు ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నారని సమాచారం. వారు అధికారికంగా ప్రాజెక్ట్ ప్రారంభ వివరాలు వెల్లడించనున్నారు.
ఈ పెట్టుబడి వెనక రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు కీలకంగా నిలిచాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో అధికారులు గత ఏడాది దక్షిణ కొరియాలో పర్యటించి హ్యుందాయ్ అధికారి లతో సమావేశమయ్యారు. అప్పట్లో ₹3,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించిన సంస్థ, ఇప్పుడు అదనంగా ₹5,528 కోట్ల పెట్టుబడికి అంగీకరించింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హ్యుందాయ్ ఇంజినీరింగ్ సెంటర్‌ను పునరుద్ధరించి, ఆధునికీకరించి, ఆసియా పసిఫిక్ మార్కెట్‌కు అనుగుణంగా విస్తరించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ఆటోమోటివ్ రంగానికి మేలైన ప్రోత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది.