హైదరాబాద్‌లో తప్పుడు కేసు పెట్టిన మహిళ.. కోర్టు ఎన్ని రోజుల శిక్ష విధించిందంటే? ఎంత జరిమానా అంటే?
హైదరాబాద్‌లో ఓ మహిళ తన మంగళసూత్రం పోయిందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అసలు ఫిర్యాదే అవాస్తవమైనది పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: ఓ మహిళ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ కేసు దర్యాప్తు చేశారు. కానీ, ఆ ఫిర్యాదే తప్పు అని తేల్చేశారు. దీంతో కోర్టు తప్పుడు కేసు పెట్టిన మహిళకు ఐదు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. అలాగే.. రూ. 200 జరిమానా విధించింది.
ఏప్రిల్ 15వ తేదీన కార్ఖానాకు చెందిన 45 ఏళ్ల యూ చెన్నమ్మ పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో తనను బెదిరించి తన మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. అప్పుడు తాను ఒంటరిగానే ఇంట్లో ఉన్నదని వివరించింది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు. దర్యాప్తు జరుపుతున్నప్పుడు చెన్నమ్మ తప్పుడు ఫిర్యాదు చేసిందని పోలీసులు గుర్తించారు. అసలు ఆమె ఆభరణం చోరీకి గురి కాలేదని తెలిపారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
కాబట్టి, తప్పుడు ఫిర్యాదులు అందించరాదని పోలీసులు సూచించారు. లేదంటే.. తప్పుడు ఫిర్యాదు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.