హైదరాబాద్: విడాకులిచ్చినా కూడ మాజీ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు ఓ వ్యక్తి. రెండో పెళ్లి ఎలా చేసుకొంటావో అని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను బంధువులకు, స్నేహితులకు పంపుతానని బ్లాక్ మెయిల్ కు దిగుతున్నట్టుగా బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also read:విజయవాడలో దారుణం: మైనర్ బాలిక కిడ్నాప్, రేప్

హైద్రాబాద్ లో పనిచేస్తున్న యువకుడికి పదకొండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ లో ఉంటున్న యువతితో పెళ్లైంది. పెళ్లైన కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలు నెలకొన్నాయి.

ఈ విషయమై రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు రాజీ కుదిర్చారు. అయినా కూడ వీరిద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. భర్త తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది.

కోర్టు కూడ ఈ దంపతులకు నాలుగేళ్ల తర్వాత విడాకులు మంజూరు చేసింది. అయితే ఆ యువతికి రెండో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. గత నెల మరో యువకుడితో నిశ్చితార్థం చేశారు.

ఈ విషయం తెలిసిన మాజీ భర్త ఆమెను వేధించడం ప్రారంభించాడు.రెండో పెళ్లి ఎలా చేసుకొంటావోనని బెదిరింపులకు దిగాడు. విడాకులు తీసుకోకముందు తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఆమె మొబైల్ కు పంపుతున్నాడు.

ఆమెకు కాబోయే భర్తకు కూడ ఈ ఫోటోలను పంపాడు. దీంతో ఈ విషయాన్ని అతను బాధితురాలికి చెప్పాడు. బాధితురాలు మాజీ భర్తకు ఫోన్ చేసింది. అతని ఫోన్ నెంబర్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.

ఆ తర్వాత కూడ ఆమె ఫోన్ కు ఇలానే ఫోటోలు పంపుతున్నాడు.  నీతో గడిపిన రోజులను గుర్తు చేసుకొనేందుకు ఈ ఫోటోలను పంపుతున్నానని బాధితురాలికి చెప్పేవాడు. అంతేకాదు ఈ ఫోటోలను స్నేహితులు, కుటుంబసభ్యులకు కూడ పంపుతానని బెదిరింపులకు దిగినట్టుగా బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వేధింపులకు పాల్పడుతున్న మాజీ భర్తపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది.  ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.