సారాంశం
మెహదీపట్నంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.
హైదరాబాద్: మెహదీపట్నంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆయిల్ రోడ్డుపై పారడంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాలు.. మాసబ్‌ట్యాంక్ ఎన్‌ఎండీసీవద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకవడంతో రోడ్డుపై పారుతున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్యాంకర్‌ను క్రేన్ సహాయంతో తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ పరిణామంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి మోహదీపట్నం, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో వాహనాలను రోడ్డు మీద నుంచి పక్కకు తీశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయిల్ రోడ్డుపై పారడటంతో.. అటువైపుగా వెళ్తున్న కొందరు వాహనదారులు జారి కిందపడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
ఉదయం పూట ట్రాఫిక్ జామ్‌తో ఆ మార్గం మీదుగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌తో పలువురు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల గుండా ఆలస్యం కాకుండా ఆఫీసుకు చేరుకునే ప్రయత్నాలు చేశారు.