హైదరాబాద్‌లో ఇన్‌స్టా రీల్స్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొట్టడంతో సర్పరాజ్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సర్పరాజ్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఇన్‌స్టా రీల్స్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొట్టడంతో సర్పరాజ్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సర్పరాజ్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియో తీస్తున్నవారికి రైలు వస్తున్న విషయం తెలుస్తుంది కదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. సర్పరాజ్‌ను సొహైల్, మోజమిల్ చంపేసి ఉంటారని అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ రిపోర్ట్ చేసింది.
అయితే శుక్రవారం నమాజ్‌కు వెళ్తున్నానని చెప్పి సర్పరాజ్ బయటకు వెళ్లినట్టుగా అతడి తండ్రి చెప్పాడు. కొన్ని గంటల తర్వాత సర్పరాజ్ అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా అతడి స్నేహితులు తెలియజేశారని తెలిపాడు. అయితే తాము వెళ్లి చూసేసరికి సర్పరాజ్ చనిపోయాడని తెలిపాడు.
ఇక, సర్పరాజ్.. హైదరాబాద్‌లోని రహమత్ నగర్‌లోని మదర్సాలో చదువుతున్నాడు. సర్పరాజ్ భరత్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ల వద్ద ఫోటోలు, ఇన్‌స్టా రీల్స్ షూట్ చేయడానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్‌కు వద్దకు వెళ్లాడు. అతడు రైల్వే ట్రాక్ పక్కనే నిల్చుని వీడియో తీయించుకుంటున్న సమయంలో వెనకాల నుంచి వచ్చిన ట్రైన్ అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో సర్ఫరాజ్ అక్కడికక్కడే మృతి చెందారు.
దీంతో సర్పరాజ్ స్నేహితులు వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించిన రైల్వే సిబ్బంది సర్ఫరాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు చెబుతున్నారు.
