హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాగోల్‌లో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్‌ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు.మృతిచెందిన వ్యక్తిని వినయ్ రెడ్డి (24)గా గుర్తించారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాగోల్‌లో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్‌ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని వినయ్ రెడ్డి (24)గా గుర్తించారు. అతడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బైక్‌ను ఢీకొట్టిన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకోవడానికి గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఏపీలోని ప్రకాశం జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు దుర్మరణం చెందారు. ఓ మినీ లారీ మరో మినీ లారీని ఢీకొట్టింది. జిల్లాలోని బేస్తవారపేట మండలం పెంచికలపాడు సమీపంలోని అనంతపురం-అమరావతి హైవేరోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా బనగానిపల్లె మండలం నందవరానికి చెందిన దాసరి చౌడయ్, ఇద్దరి కొడుకులతో కలిసి మినీలారీలో మిర్చిని గుంటూరుకు తరలిస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా కోసూరు మండలం ఆవులవారిపాలేనికి చెందిన ఈపూరి ఏడుకొండలు, అదే గ్రామానికి చెందిన డ్రైవర్ గోపు తిరుపతయ్య సాయంతో కోడెదూడలను మినీ లారీలో ఎక్కించుకుని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఇడమకల్లుకు వస్తున్నారు.
పెంచికలపాడు వద్దకు వచ్చేసరికి కోడె దూడలతో వస్తున్న మినీలారీ వేగంగా దూసుకువచ్చి మిర్చి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో మిర్చి లారీలో ప్రయాణిస్తున్న దాసరి చౌడయ్య, ఆయన కొడుకు నగేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. కోడెదూడలతో వస్తున్న మినీలారీలో ఉన్న తిరుపతయ్య, ఈపూరి ఏడుకొండలు (22) క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి మృతిచెందారు. మిర్చి లారీలో ప్రయాణిస్తున్న మరోకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ప్రమాదంలో మూడు కోడెదూడలు కూడా మృతిచెందాయి. మరో నాలుగింటి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై బెస్తవారపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
