Asianet News TeluguAsianet News Telugu

మా కల నెరవేరుస్తున్న కేటీఆర్‌కు థాంక్స్.. : ఆనంద్ మహీంద్రా ట్వీట్.. హైదరాబాద్‌లో ‘ఫార్ములా ఈ’ రేసింగ్

ఫార్ములా ఈ రేసింగ్‌ను నిర్వహించడానికి హైదరాబాద్ నగరం సిద్ధమవుతున్నది. ఈ రేసింగ్‌ను నిర్వహించడానికి హైదరాబాద్ నగరం ఖరారైనట్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం, ఎఫ్ఐఏ ఫార్ములా ఈ మధ్య ఒప్పందం కుదిరిందని, ఈ రేసింగ్‌ను నిర్వహించడానికి హైదరాబాద్‌ నగరం ఎంపికైందని తెలంగాణ ఐటీ శాఖ వెల్లడించింది. ఈ ప్రకటనపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. తమ చిరకాల స్వప్నం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.
 

hyderabad set to host formula e racing.. anand mahindra thanks KTR
Author
Hyderabad, First Published Jan 18, 2022, 10:26 AM IST

హైదరాబాద్: ఫార్ములా వన్ రేసింగ్‌(Formula E Racing)కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్నది. అదే శ్రేణిలో ఫార్ములా ఈ కూడా ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నది. ఇప్పుడు ఫార్ములా ఈ రేసులు వరల్డ్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నది. ఇలాంటి అరుదైన రేసుకు రాజధాని నగరం హైదరాబాద్(Hyderabad) వేదిక కానుంది. ఈ విషయం తాజాగా ఖరారైంది. తెలంగాణ మంత్రి కేటీఆర్(Minister KTR) ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) హర్షం వ్యక్తం చేశారు. సొంత గడ్డపై తమ కార్లు రేస్ చేయాలన్నది తమ కల అని, ఇప్పుడు ఆ కలను సాకారం చేసేలా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు(Thank You) అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్, ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ చాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో‌ సంయుక్తంగా ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల నిర్వహణపై సోమవారం కీలక ప్రకటన చేశారు. అదే సందర్భంగా మహీంద్రా రేసింగ్ మొదటి నుంచి అందిస్తున్న సహకారాన్ని కూడా అల్బెర్టో లాంగో ప్రస్తావించారు. తెలంగాణ ఐటీ శాఖ ట్విట్టర్‌లో కీలక ప్రకటన చేసింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం, ఎఫ్ఐఏ ఫార్ములా ఈ మధ్య ఒప్పందం కుదిరిందని, ఈ రేసింగ్‌ను నిర్వహించడానికి హైదరాబాద్‌ నగరం ఎంపికైందని వివరించింది.

ఫార్ములా వన్ తరహాలోనే ఇ-వన్ చాంపియన్‌షిప్ కూడా ప్రపంచస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నది. ఈ రేసింగ్‌కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌కు ప్రత్యేక ట్రాక్ అక్కర్లేదు. ఈ ‘ఈ- వన్ ఫార్ములా’ చాంపియన్‌షిప్ పోటీలను 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వ్యవస్థాపక బృందంగా మహీంద్ర రేసింగ్ కూడా ఉన్నది.

ఫార్ములా ఈ రేసింగ్‌లో తాము వ్యవస్థాపక బృందంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మహీంద్రా రేసింగ్ తమ కార్లను సొంత గడ్డపై రేస్ నిర్వహించాలని దీర్ఘకాలంగా కల కంటున్నదని వివరించారు. సొంగ ప్రజల కేరింతలను వినాలనుకున్నదని తెలిపారు. ఆ కలను నిజం చేసేలా తెలంగాణ మంత్రి కేటీఆర్ అడుగులు వేసినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ రేసింగ్ కోసం తాము ఎదురుచూస్తున్నామని వివరించారు.

కాగా, ఫార్ములా ఈ రేసింగ్ లండన్, న్యూయార్క్, మెక్సికో, రోమ్, బెర్లిన్, సియోల్, వాంకోవర్ నగరాల్లో పోటీలు జరిగాయి. తాజాగా, తొమ్మిదో సీజన్‌కు సంబంధించిన పోటీలను సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలుస్తున్నది. ఆ తర్వాత నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసింగ్‌కు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios